నేటి నుంచి కేసీఆర్‌ దేశాటన...అందుకేనా?

May 20, 2022


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేటి నుంచి సుమారు వారం రోజులపాటు ఢిల్లీ, చంఢీఘడ్, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. తాను జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నానని, బిజెపికి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ లేదా కూటమి ఏర్పాటు చేయాలనుకొంటున్నానని సిఎం కేసీఆర్‌ చాలా స్పష్టంగానే చెప్పారు. కనుక ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటనకు బయలుదేరుతున్నట్లు భావించవచ్చు. 

ఈసారి పర్యటనలో ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్‌  కేజ్రీవాల్‌, అదే పార్టీకి చెందిన పంజాబ్‌ సిఎం భగవంత్ మాన్‌ను సిఎం కేసీఆర్‌ కలుపుకోవడం కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. వారితో కలిసి హర్యానా, పంజాబ్‌, యూపీలకు చెందిన 600 రైతు కుటుంబాలకు చంఢీఘడ్ సభలో రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. ఆ తరువాత యూపీ, బీహార్ రాష్ట్రాలలో గాల్వాన్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించి వారికీ చెక్కులను అందజేయబోతున్నారు. 

తద్వారా ఆయా రాష్ట్రాల ప్రజలలో సిఎం కేసీఆర్‌ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును, అక్కడి ప్రజల, రైతుల అభిమానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రంలోనే నిత్యం ఆర్ధిక సమస్యలతో, అప్పుల బాధలు భరించలేక మద్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారస్తులు, రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా, సిఎం కేసీఆర్‌ ఏనాడూ వారి కుటుంబాలకు ఈవిదంగా ఆర్ధికసాయం అందించలేదు. కనీసం తన ప్రెస్‌మీట్‌లలో ఆ ప్రస్తావన చేయరు.  

రాష్ట్రంలో రైతులకు రైతు భరోసాతో ఏడాదికి రూ.10 వేలు, ఒకవేళ వారు చనిపోతే వారి కుటుంబాలకు రైతు భీమాతో రూ.5 లక్షలు ఇస్తున్నామని టిఆర్ఎస్‌ నేతలు సమర్ధించుకోవచ్చు. కానీ సిఎం కేసీఆర్‌, కాబోయే సిఎం కేటీఆర్‌ గానీ ఏనాడూ వెళ్ళి వారిని పరామర్శించలేదు. కానీ ఎక్కడో యూపీ, హర్యానా, బీహార్ రాష్ట్రాలలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్నారు. కనుక ఆయా రాష్ట్రాలలో సిఎం కేసీఆర్‌ ఈవిదంగా ఓ జాతీయ నేతగా గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. 

సిఎం కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌, నటుడు ప్రకాష్ రాజ్‌, బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రే, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్, యూపీలో సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ వంటివారిని తనవైపు తిప్పుకొన్నారు. ఇప్పుడు మంచి ప్రజాధారణ కలిగిన అరవింద్‌  కేజ్రీవాల్‌, భగవంత్ మాన్‌ వంటివారు కూడా తోడైతే సిఎం కేసీఆర్‌ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు వేగం పుంజుకోవచ్చు. 


Related Post