ప్రధాని హంతకుడు విడుదలైతే పండగ చేసుకొనే దేశం మనదేనేమో?

May 19, 2022


img

ఒక హంతకుడికి, అతని కుటుంబ సభ్యులను మన సమాజం దూరం పెడుతుంది. ఇక వారిని గౌరవం అసలే జరగని పని. కానీ దేశ ప్రధాన మంత్రి హత్యలో దోషిగా నిర్ధారించబడి మరణశిక్ష కూడా విధించబడిన ఓ ఖైదీ జైలు నుచి విడుదలైతే పండగ చేసుకొనే దేశం మనదేనేమో? 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి, గత 31 ఏళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్‌ను తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడంతో అతను నిన్న చెన్నైలో జైలు నుంచి విడుదలయ్యాడు. 

అతను జైలు నుంచి విడుదలవుతున్నట్లు తెలియగానే అధికార డీఎంకె శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆయనకు పూల దండలు వేసి స్వీట్లు తినిపించి ఘనంగా స్వాగతం పలికారు. నిన్న రాత్రి అతను తన తల్లితో కలిసి సిఎం స్టాలిన్‌ నివాసానికి వెళ్లినప్పుడు ఆయన కూడా సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి కౌగలించుకొన్నారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కూడా. రాజీవ హత్య కేసులో దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురిని కూడా ఇదేవిదంగా తప్పకుండా విడిపించుకొంటానని సిఎం స్టాలిన్‌ నమ్మకం వ్యక్తం చేశారు.  

గత శాసనసభ ఎన్నికలలో డీఎంకె పార్టీ అధికారంలోకి వస్తే రాజీవ్ హంతకులను విడిపిస్తాననే హామీని ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది.

దేశ ప్రధానిని హత్య చేసినవారిని కాపాడటం కోసం అధికార, విపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడటం, సుప్రీంకోర్టు వారికి మరణ శిక్షలు విధించినప్పుడు, వాటిని అమలుచేయకూడదని శాసనసభలో తీర్మానాలు చేయడం, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టడం చాలా విస్మయం కలిగిస్తుంది.  

ఆ హంతకులు లేదా ఆ కుట్రలో భాగస్వాములను జైలు నుంచి విడిపించుకొనేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం, దానికి కేంద్రం తలొగ్గడం, మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చి చివరికి ఈవిదంగా విడిపించుకోవడం, అతను విడుదలైతే ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి కౌగలించుకొని ఫోటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిజమైన భారతీయులు ఎవరూ హర్షించలేరు. కానీ ప్రధాని హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి జైలు నుంచి విడుదలైతే తమిళనాడులో రాజకీయపార్టీలు నిర్లజ్జగా పండగ చేసుకొన్నాయి. ప్రధాని హంతకుడు విడుదలైతే పండగ చేసుకొనే ఏకైక దేశం మనదేనేమో? 


Related Post