తమిళ హీరో విజయ్ బుదవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి 66 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు, విజయ్ ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. టిఆర్ఎస్ ఎంపీ జె. సంతోష్ విజయ్‌ని ప్రగతి భవన్‌కు తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్, విజయ్ సుమారు అర్ధగంటసేపు మాట్లాడుకొన్నారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన భేటీయే తప్ప మరే ప్రస్తావన రాలేదని సంతోష్ మీడియాకు తెలిపారు.
తమిళనాడులో విజయ్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక విజయ్ కూడా పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అటువంటి సంకేతాలు ఇచ్చారు కూడా. కనుక దాని గురించి సిఎం కేసీఆర్ సలహా కోరి ఉండవచ్చు. సిఎం కేసీఆర్ కూడా జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రవేశించాలని భావిస్తున్నారు. కనుక విజయ్ వంటి సినీ నటుల సహాయసహకారాలు కూడా అవసరం ఉంటుంది.