విదేశీ బొగ్గు కొనాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి!

May 19, 2022


img

స్వదేశీ ఉత్పత్తులనే వాడుతూ దేశంలోని పరిశ్రమలను ప్రోత్సహించాలని చెపుతున్న మోడీ ప్రభుత్వం, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల కోసం రాష్ట్రాలు కనీసం 10 శాతం విదేశీ బొగ్గును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసింది.   దేశంలో బొగ్గు కొరత, ఆ కారణంగా విద్యుత్‌ కొరత ఏర్పడుతుండటంతో విదేశాల నుంచి భారీగా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కానీ తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు ఉన్నందున వాటి నుంచి వచ్చే బొగ్గే విద్యుత్‌ ఉత్పత్తికి సరిపోతోంది. వాటికి సరఫరా చేయగా మిగిలిన బొగ్గును సింగరేణి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తోంది. 

కనుక తెలంగాణ విద్యుత్‌ ప్లాంట్లకు విదేశీ బొగ్గు అవసరమే లేదు. కానీ ఈ నెలాఖరులోగా కనీసం 10 శాతం, జూన్‌ నెలాఖరులోగా మరో 5 శాతం విదేశీ బొగ్గుకు ఆర్డర్ పెట్టాలని లేకుంటే ఇక నుంచి ప్రతీ నెల 5 శాతం చొప్పున దేశీ బొగ్గు సరఫరాలో కోత విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు కూడా వ్రాసింది.

దేశంలో బొగ్గు, విద్యుత్‌ కొరత ఏర్పడినప్పటి నుంచి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తరచూ తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తరువాత రాష్ట్రాల విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో కూడా సమావేశమయినప్పుడు, తెలంగాణ జేన్‌కో అధికారులు సింగరేణి నుంచి పుష్కలంగా బొగ్గు సరఫరా అవుతోందని కనుక తెలంగాణకు విదేశీ బొగ్గు అవసరం లేదని చెప్పారు. 

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటికే విదేశీ బొగ్గు ధర టన్నుకు రూ.45,000కి చేరిందని, అంత ధర చెల్లించినా మళ్ళీ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు నుంచి రాష్ట్రానికి తెచ్చుకోవాలంటే ఇంకా ఖర్చు పెరుగుతుందని, అదే...సింగరేణి బొగ్గు టన్ను కేవలం రూ.5,000కే లభ్యం అవుతోందని వారు కేంద్రమంత్రికి చెప్పారు. ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీలు పెంచవలసి వచ్చిందని, అవసరం లేకపోయినా అంత ధర చెల్లించి విదేశీ బొగ్గు దిగుమతి చేసుకొంటే, విద్యుత్‌ ఛార్జీలు ఇంకా పెంచవలసి వస్తుందని తెలిపారు. కానీ, కేంద్రమంత్రి మాత్రం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు రాష్ట్రాలు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవలసిందే అని హుకుం జారీ చేశారు. 


Related Post