బండి ఆత్మవిశ్వాసం, పోరాటం బాగుంది కానీ...

May 18, 2022


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడలో నిర్వహించిన దాని ముగింపు సభ విజయవంతం అవడంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌లో బూత్ స్థాయి పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో పూర్తి ఆత్మవిశ్వాసం కనబడింది. 

పార్టీలో అందరూ కలిసికట్టుగా తుక్కుగూడ సభను ఏవిదంగా విజయవంతం చేశామో అదే స్పూర్తితో పనిచేస్తే వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కష్టం కాదని అన్నారు. సిఎం కేసీఆర్‌ నిరంకుశ అప్రజాస్వామిక పాలనతో విసుగెత్తిపోయున్న ప్రజలు బిజెపివైపు చూస్తున్నారని కనుక మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అందుకే బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడంపై శ్రద్ద పెట్టి తగిన కార్యాచరణ రూపొందిస్తున్నానని చెప్పారు. 

బండి సంజయ్‌ పార్టీ పగ్గాలు చేపట్టక మునుపు రాష్ట్రంలో బిజెపి దాదాపు నిద్రావస్థలో ఉండేది. దానిని ఆయన మేల్కొల్పి ఉరుకులు పరుగులు పెట్టిస్తూ వరుస విజయాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని విజయపదం వైపు నడిపిస్తూ సమర్దుడైన నాయకుడిగా ఇటు పార్టీలోను, అటు ప్రజలలోను మంచి గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న టిఆర్ఎస్‌ కూడా ఆయన దూకుడు చూసి ఆందోళన చెందుతూ బిజెపిపై యుద్ధం ప్రకటించడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

బండి సంజయ్‌ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న కృషి, వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలనే ఆయన పట్టుదల చాలా అభినందనీయం. అయితే సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తుంటే, టిఆర్ఎస్‌ను కాదని కేవలం హిందుత్వ అజెండాతో పనిచేసే బిజెపికి అధికారం కట్టబెడతారా?అంటే కాదనే చెప్పవచ్చు. 

కానీ బండి సంజయ్‌ అలుపెరుగని పోరాటాలు, ఎన్నికలలో బిజెపి అమలుచేసే హిందుత్వ వ్యూహాల కారణంగా వచ్చే శాసనసభ ఎన్నికలలో బిజెపి కనీసం 20-25 సీట్లు తప్పకుండా గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాలేకపోయినా టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారి ప్రభుత్వాన్ని ఆస్తిరపరిచేందుకు ఆ మాత్రం సీట్లు చాలు. బహుశః సిఎం కేసీఆర్‌ కూడా ఈవిషయం గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే బండికి బ్రేకులు వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. 


Related Post