మన కృష్ణయ్యకు ఏపీలో రాజ్యసభ సీటు ఖరారు!

May 17, 2022


img

మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన గౌరవం లభించింది. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేశారు. ఈరోజు సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని అధికారికంగా దృవీకరించింది కూడా. బహుశః ఏపీలో బీసీ సంఘాలతో ఆయనకు ఉన్న పరిచయాలు, స్నేహాలు వచ్చే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీకి పనికివస్తాయని భావించి ఆయనకు ఈ సీటు ఇచ్చి ఉండవచ్చు. 

ఆర్.కృష్ణయ్యకు ఇటువంటి లాటరీ తగలడం ఇదే తొలిసారి కాదు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను హడావుడిగా పార్టీలో చేర్చుకొని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేశారు. అంత అదృష్టం ఎవరికి దక్కుతుంది?అయితే ఆ ఎన్నికలలో ఆయన ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేసి గెలిచారు కానీ టిడిపి ఓడిపోవడంతో ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కోల్పోయారు. కానీ అప్పటి నుంచి రాజకీయాలలో తిరుగుతూ రాజకీయాలను బాగానే ఒంట పట్టించుకొన్నారు. 

2018 ఎన్నికల సమయానికి తెలంగాణలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో మునిగిపోయిన ఆ పార్టీని ఇంకా  అంటిపెట్టుకొని ఉండి ప్రయోజనం లేదని గ్రహించి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. కానీ ఆ ఎన్నికలలో టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో జంప్ చేసి వైసీపీలో చేరి టికెట్ పట్టి జగిత్యాల నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 

ఇక మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూపులు తప్పవని కృష్ణయ్య అనుకొంటుంటే హటాత్తుగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపిస్తున్నారు. అదృష్టం అంటే ఇదే కదా..తంతే బూరెల గంపలో పడినట్లు! 


Related Post