ఇదిగో భద్రాద్రి... సమస్యలెన్నో చూడండి...

May 16, 2022


img

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవాలు శ్రీ సీతారామచంద్రులవారు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో సహా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి దూర ప్రాంతాల నుంచి కూడా నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

అంత దూరం నుంచి వచ్చే భక్తుల నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు, ప్రత్యేక పూజలకు టికెట్స్ అందుబాటులో ఉంటాయి. భక్తులు ఎప్పుడు ఎంత విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తుంటారు. కానీ భక్తులకు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కూడా అందించడం లేదు. 

భద్రాచలం పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతున్నప్పటికీ ఉదయం 10లోపుగా దర్శించుకొనే భక్తులకు మాత్రమే అన్నదానం టోకెన్లు ఇచ్చి వారితోనే సరిపెడుతోంది. ఆ తరువాత వచ్చిన భక్తులు టోకెన్లు అడిగినా సిబ్బంది ‘టైమ్ అయిపోయిందని’ చెప్పి తప్పించుకొంటున్నారు. 

దేవుడి ప్రసాదానికి వంకలు పెట్టకూడదు కానీ డబ్బులు చెల్లించి కొంటునప్పుడు నాణ్యత, రుచి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. లడ్డూ ప్రసాదం కూడా తిరుపతి లడ్డూ ప్రసాదంలా కాక బయట స్వీట్ షాపులో లడ్డూ రుచిని పోలి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఆ లడ్డూ తప్ప పులిహోర, చక్కెర పొంగలి వంటి మరే ప్రసాదం లభించదు. 

భద్రాచలం బస్టాండ్ నుంచి ఆలయం వరకు, ఆలయం నుంచి పర్ణశాలకు దేవస్థానం బస్సులు లేకపోవడంతో భక్తులు తప్పనిసరిగా ఆటోలు, టాక్సీలలోనే ప్రయాణించవలసి వస్తోంది. భద్రాద్రి వంటి అతి ప్రసిద్దమైన మంచి ఆదాయం కలిగిన పుణ్యక్షేత్రం భక్తుల కోసం ఉచితంగా బస్సులు ఎందుకు నడిపించలేకపోతోందో తెలీదు. కనీసం టీఎస్‌ఆర్టీసీతో ఒప్పందం చేసుకొన్నా బాగుండేది కదా? 

ఇక భద్రాద్రికి వెళితే మొట్ట మొదట కనిపించేవి ఆవుల మందలే. మండువేసవిలో వాటికి కనీసం ఎక్కడికక్కడ తాగునీటి కుండీలు ఏర్పాటు చేస్తే బాగుండేదని భక్తులు అనుకొంటున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రులవారి దర్శన భాగ్యం కలిగిందనే తృప్తి తప్ప భక్తులకు అడుగడుగునా అసౌకర్యాలు తప్పవు. 


Related Post