బిజెపి విమర్శలతో టిఆర్ఎస్‌కు లాభామా నష్టమా?

May 16, 2022


img

సిఎం కేసీఆర్‌ మీద, టిఆర్ఎస్‌ ప్రభుత్వం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదలు కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, జేపీ నడ్డా, బండి సంజయ్‌ తదితర బిజెపి నేతలు చాలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. బండి సంజయ్‌ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్‌ లీగల్ నోటీస్ కూడా పంపారు. 

బిజెపి నేతలు చేస్తున్న ఈ తీవ్ర విమర్శలు, ఆరోపణలతో టిఆర్ఎస్‌కు లాభామా నష్టమా?వాటిపై ప్రజలు ఏమనుకొంటున్నారు?అని ఆలోచిస్తే చక్కటి సమాధానాలు కనిపిస్తాయి. 

సిఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలతో ఏవిదంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్: 1 స్థానంలో నిలిపి చూపారు. వివిద వర్గాల ప్రజలకు అత్యంత ఉపయోగపడే విదంగా సంక్షేమ పధకాలను డిజైన్ చేసి విజయవంతంగా అమలుచేస్తున్నారు. 

రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు హరితహారం, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి వంటి చక్కటి కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలను హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారు. 

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐటి కంపెనీలను ఆకర్షిస్తూ లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ కాగితాల మీద ఉన్నవి కావు ప్రత్యక్షంగా కంటికి కనబడుతున్నవే. 

కనుక రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ పట్ల వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్‌ లేదా బిజెపికి ఓట్లేసి అధికారం కట్టబెడతారనుకోలేము. పైగా బిజెపి నేతలు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నందుకు, ఆ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగవచ్చు. 

తెలంగాణ సాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గౌరవనీయులైన, వయసులో, రాజకీయ అనుభవంలో పెద్దవారైన సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి బిజెపి నేతలు చాలా చులకనగా మాట్లాడుతున్నారంటూ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారు అందుకే పదేపదే గట్టిగా నొక్కి ప్రజలకు గుర్తుచేస్తున్నారనుకోవచ్చు. 

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహాయసహకారాలు అందించడం లేదని, రాష్ట్ర బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేకుండా తిరిగి సిఎం కేసీఆర్‌నే నిందిస్తున్నారంటూ టిఆర్ఎస్‌ చేస్తున్న వాదనలు కూడా ప్రజల మనసులలో బలంగానే నాటుకొంటున్నాయి. ఆ విదంగా కూడా బిజెపికి నష్టం అంటే టిఆర్ఎస్‌కు లాభం జరుగవచ్చు. 

అయితే బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలతో టిఆర్ఎస్‌కు అంతా లాభమే జరుగుతుందని కూడా అనుకోలేము. వారు పదేపదే చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం తమను మోసం చేస్తోందనే భావన ప్రజలలో వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది. దుబ్బాక, హుజూరాబాద్‌, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌పై బిజెపి పైచేయి సాధించగలగడమే ఇందుకు నిదర్శనం. అందుకే బిజెపి ఈ విధానంతోనే దూసుకుపోతూ టిఆర్ఎస్‌ కంచుకోటని బద్దలు కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. 

అయితే టిఆర్ఎస్‌, బిజెపిల పోరులో చివరికి ఏ పార్టే గెలుస్తుందో ఎన్నికలు జరిగితే గానీ తెలియదు. కనుక అంతవరకు వేచి చూడక తప్పదు.


Related Post