ఈ మాటల యుద్ధంతో ఏమి జరుగబోతోంది?

May 16, 2022


img

టిఆర్ఎస్‌, బిజెపిల పరస్పర విమర్శలు, ఆరోపణలను అందరూ వింటూనే ఉన్నారు. వాటిపై ఎవరి అభిప్రాయాలు వారివే. అయితే వాటి ఈ మాటల యుద్ధం ఏమి జరుగబోతోంది?అని ఆలోచిస్తే చాలా తీవ్ర పరిణామాలే జరిగవచ్చని అర్ధమవుతుంది. 

ముందుగా సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు నేరుగా ప్రధాని నరేంద్రమోడీని పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. నరేంద్రమోడీ అసమర్ధుడు, దూరదృష్టిలేనివాడు, దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారంటూ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని టిఆర్ఎస్‌ పదేపదే ఆరోపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీని ఇంతగా విమర్శిస్తున్నందున ఇప్పుడు కేంద్రం నిజంగానే తెలంగాణకు సహాయనిరాకరణ చేయవచ్చు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ధాన్యం కొనుగోలు వ్యవహారం కనబడుతోంది. కేంద్రం నిరాకరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ భారం భరించవలసి వస్తోంది. 

ఇకపై రాష్ట్రంలో అమలవుతున్న వివిద అభివృద్ధి పనుల వేగం తగ్గించి,  సంక్షేమ పధకాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులకు లెక్కలు అడగవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కొత్త అప్పులు పొందకుండా అడ్డుకొంటూ, ఇప్పటివరకు చేసిన అప్పులు వడ్డీల చెల్లింపుల కొరకు ఒత్తిడి పెంచవచ్చు. 

టిఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతి చిట్టాలు కేంద్రం వద్ద ఉన్నాయని బండి సంజయ్‌ పదేపదే చెపుతున్నారు కనుక  సిఎం కేసీఆర్‌ ముందే చెప్పినట్లు ఏదో ఓ రోజు మంత్రుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి, ఈడీ, సిబిఐ దాడులు జరగవచ్చు. కేసులు నమోదు కావచ్చు. ఆవిదంగా టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను లొంగదీసుకొని బిజెపిలో చేర్చుకొని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బలహీనపరిచినా ఆశ్చర్యం లేదు. 

ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు విషయంలో కొర్రీలు వేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. కనుక బిజెపిని ఎదుర్కోవడానికి కేంద్రంతో టిఆర్ఎస్‌ ఈవిదంగా గొడవ పెట్టుకోవడం వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగవచ్చు. 


Related Post