టిఆర్ఎస్‌ సవాల్‌ను బిజెపి స్వీకరించగలదా?

May 16, 2022


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలకు మంత్రి కేటీఆర్‌ ఊహించని స్థాయిలో సవాల్ విసిరారు. 

“సిఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీల పరిపాలనలో ఎవరిది బాగుందో తెలుసుకోదలిస్తే తక్షణం లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. టిఆర్ఎస్‌ కూడా శాసనసభను రద్దు చేసి బిజెపిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉందని మంత్రి కేటీఆర్‌ బిజెపికి సవాల్ విసిరారు. 

బిజెపి కూడా శాసనసభ రద్దయ్యి రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని కోరుకొంటోంది కానీ కేటీఆర్‌ సవాలును స్వీకరించగలదా?అంటే లేదనే చెప్పవచ్చు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఎంతో కష్టం. కనుక టిఆర్ఎస్‌ మంత్రులు సవాలు చేస్తున్నారని మరో రెండేళ్ళ అధికారాన్ని వదులుకొని ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళేంత తెలివి తక్కువది కాదు బిజెపి. 

అయితే నేటికీ కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వం చాలా బలహీనంగా ఉండటం, జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయం లేకపోవడం వలన ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలిచి అధికారంలోకి రావచ్చు. 

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కాస్త బలపడినప్పటికీ ఇక్కడ కూడా ఇంచుమించు ఇటువంటి రాజకీయ పరిస్థితులే నెలకొన్నాయి. కనుక ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ టిఆర్ఎస్‌ పార్టీయే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు. 

అయితే ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ఎన్నికలు రావని అందరికీ తెలుసు. కానీ వీటితో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతాయి కనుక ప్రజలు ఏ గట్టున ఉండాలో ఆలోచించుకోవడం మొదలుపెడతారు. టిఆర్ఎస్‌, బిజెపిలు కోరుకొంటున్నది ఇదే! అప్పుడు వారిని తమవైపు తిప్పుకోవాలని వాటి ఆశ.   



Related Post