అమిత్ షా విమర్శలలో పస ఉందా?

May 14, 2022


img

కేంద్రహోంమంత్రి అమిత్ షా ఈరోజు తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, టిఆర్ఎస్‌ ప్రభుత్వం అన్నివిధాల వైఫల్యం చెందిందని, కనీసం నిధులు, నీళ్ళు, నియామకాల ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. తాము అధికారం కోసం తహతహలాడటం లేదని నిరంకుశ నిజాం నవాబుని గద్దె దింపి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలకు విముక్తి కల్పించడానికే అని అన్నారు. కేసీఆర్‌ కమీషన్లు వచ్చే ప్రాజెక్టులే మొదలుపెడతారు తప్ప మిగిలినవాటిపై శ్రద్ద చూపరని విమర్శించారు. 

గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌ను పట్టించుకోకుండా నగరానికి నాలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కట్టిస్తానని సిఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో పధకాలు అమలుచేసుకొంటూ వాటిని తమ ప్రభుత్వం అమలుచేస్తోందని అబద్దాలు చెపుతూ టిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసాగిస్తోందని అన్నారు. 

టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ని గద్దె దించి రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలనకు బిజెపి ముగింపు పలుకుతుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. 

అయితే అమిత్ షా చేసిన విమర్శలు, ఆరోపణలలో పస లేదని వింటేనే అర్ధం అవుతోంది. నిధులు విషయంలో సిఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తే కేంద్రప్రభుత్వమే దోషిగా నిలబడాల్సి ఉంటుందని మరిచినట్లున్నారు. నీళ్ళ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పలు జిల్లాలలో ఏడాది పొడవునా నీళ్ళు పారుతుండటం పాదయాత్ర చేసి వచ్చిన బండి సంజయ్‌కి చెప్పినట్లు లేదు. నీళ్ళ విషయంలో అమిత్ షా విమర్శలు చేసిన ఈరోజే మంత్రి కేటీఆర్‌ సుంకిశాల ఇన్‌టేక్ వెల్‌కి శంఖుస్థాపన చేశారు. దాంతో మరో 50 ఏళ్ళ వరకు హైదరాబాద్‌కు తాగునీటి కొరత ఉండదు. నీళ్ళ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంత దూరదృష్టితో ఆలోచిస్తుంటే అమిత్ షా ఈవిదంగా విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

ప్రభుత్వోద్యోగాల విషయంలో చాలా ఆలస్యం జరిగినప్పటికీ గత ఏడేళ్ళుగా రాష్ట్రానికి తరలివచ్చిన వందలాది ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల ద్వారా లక్షలాదిమందికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించగలిగింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎక్కడికక్కడ అనేక హబ్‌లు, ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటుచేసింది. వాటిలో అనేక చిన్నా, పెద్ద పరిశ్రమలు, కంపెనీలలో అనేకమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

గత ప్రభుత్వాల హయాంలో శంకుస్థాపన చేస్తే నిర్మాణాలు జరుగుతాయనే గ్యారెంటీ ఉండేది కాదు. అందుకే శిలాఫలకాలపై అనేక జోక్స్ పుట్టుకొచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం దేనికైనా శంకుస్థాపన చేసిందంటే అది ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా సకాలంలోనే పూర్తయితీరాల్సిందే. అందుకు తెలంగాణ అంతటా కోకొల్లలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. 

టిఆర్ఎస్‌ ఓ రాజకీయ పార్టీ కనుక అది మజ్లీస్‌తో స్నేహం చేయడాన్ని బిజెపి తప్పు పట్టలేదు. నిజానికి ఆ రెంటి స్నేహం బలంగా ఉండటం వలననే హైదరాబాద్‌లో గత ఏడేళ్ళుగా చాలా ప్రశాంత వాతావరణం నెలకొంది ఉందని చెప్పక తప్పదు. 

బిజెపికి అధికార దాహం ఉంది కనుకనే తెలంగాణపై దృష్టి పెట్టింది. అందుకే బండి సంజయ్‌ 45 డిగ్రీల వేడిలో కూడా పాదయాత్రలు చేశారు. ఒకవేళ తెలంగాణలో బిజెపికి అవకాశం ఉండదని భావిస్తే ఏపీలో బిజెపిని పట్టించుకోనట్లు తెలంగాణ బిజెపిని కూడా అమిత్ షా పట్టించుకొనేవారు కాదు కదా? 

కనుక తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం అని చెప్పుకొన్నప్పుడు చల్లకు వచ్చి ముంత దాచుకొన్నట్లు కేసీఆర్‌ని గద్దె దించడానికే మా ప్రయత్నాలన్నీ అని చెప్పుకోవడం దేనికి?అయినా దానార్ధం బిజెపి అధికారం కోరుకొంటోందనే కదా? 


Related Post