అమిత్ షా వస్తున్నారు...మళ్ళీ మంటలే

May 14, 2022


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా నేడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ 14వద్ద భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. 

ఈ సభకు కేంద్రహోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌ చేరుకోగానే శంషాబాద్ వద్ద గల నోవాటేల్‌లో పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యి, బండి సంజయ్‌ పాదయాత్ర గురించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకొని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. తరువాత అక్కడి నుంచి పార్టీ నేతలతో కలిసి సాయంత్రం 6.30 గంటలకు సభా ప్రాంగణం చేరుకొంటారు. ఆయనతో పాటు తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, సీనియర్ నేత కె.లక్ష్మణ్ తదితర ముఖ్య నేతలంతా ఈ సభలో పాల్గొంటారు. 

ఇప్పటికే టిఆర్ఎస్‌, బిజెపిలు పరస్పరం కత్తులు దూసుకొంటున్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అవడంతో బండి సంజయ్‌తో సహా పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. బండి సంజయ్‌ తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్‌నిన్ననే లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా చెపుతున్న అమిత్ షా నేడు ఈ సభకు హాజరవుతున్నారు. 

కనుక ఆయన సిఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం ఖాయం. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ బండి సంజయ్‌కి లీగల్ నోటీస్ ఇచ్చిన మర్నాడే ఈ సభ జరుగుతుండటంతో దీనిలో పాల్గొనే నేతలు ఆ ప్రస్తావన చేసి సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వంపై నిప్పులు కురిపించక మానరు. అప్పుడు టిఆర్ఎస్‌ నేతలు కూడా అదే స్థాయి ప్రతి విమర్శలు చేయడం ఖాయం. కనుక నేడు తుక్కుగూడలో జరుగబోయే ఈ సభతో, దానిలో అమిత్ షాతో సహా బిజెపి నేతలు చేయబోయే విమర్శలతో రాష్ట్రంలో భగభగమని రాజకీయ మంటలు చెలరేగడం ఖాయం.


Related Post