తెలంగాణలో రవాణాశాఖ బాదుడే బాదుడు!

May 12, 2022


img

తెలంగాణ రవాణాశాఖ గుట్టుచప్పుడు కాకుండా వాహనాలపై పన్నులు పెంచేసింది. అయితే ఈవిషయం అధికారికంగా ప్రకటించక పోవడంతో వాహన యజమానులు వాటి పన్ను చెల్లిస్తున్నప్పుడే ఈవిషయం తెలుస్తోంది. రవాణాశాఖ సిబ్బంది చేతికి ఇస్తున్న ఆ బిల్లులను చూసి షాక్ అవుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, నిరసనలు ఎదురవుతాయనే రవాణా శాఖ ఈవిదంగా చేసి ఉండవచ్చు.  

ఇంతకు ముందు వాహనాలపై జీవితకాల పన్ను 14 శాతం ఉండేది దానిని 17 శాతానికి పెంచేసింది. ఇదికాక గ్రీన్‌ టాక్స్ కూడా విధిస్తోంది. గతంలో ద్విచక్ర వాహనాలకు గ్రీన్‌ టాక్స్‌ రూ.285, ప్రభుత్వ ఫీజు మరో రూ.735 కలిపి మొత్తం రూ.1,020 ఉండేది. ఇప్పుడు అది రూ.2,035+1,400 కలిపి మొత్తం రూ.3,435కి పెరిగింది.

అదేవిదంగా గతంలో కార్లకు రెండూ కలిపి రూ.1,700 ఉండగా అదిప్పుడు రూ.6,535కి పెరిగింది. ఇక టాటా ఎస్ వంటి మినీ వాహనాలకు, లారీలు, బస్సులకు ఈ పచ్చ వడ్డింపు ఇంకా భారీగా ఉంటుందని వేరే చెప్పక్కరలేదు.  

గ్రీన్‌ టాక్స్‌తో వాహనాల వినియోగం తగ్గే మాటయితే వాహనాలను తయారుచేసే కంపెనీలు ఎప్పుడో మూతబడి ఉండేవి. కానీ ప్రభుత్వాలు గ్రీన్‌ టాక్స్‌ నానాటికీ పెంచుతున్నప్పటికీ, పెట్రోల్, డీజిల్‌ ధరలు నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ, ట్రాఫిక్ చలాన్లు వసూలు చేస్తున్నప్పటికీ వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అందుకే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు కూడా నిర్మిస్తోంది. కనుక ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసమే గ్రీన్‌ టాక్స్ పేరు చెప్పి ప్రజల వద్ద నుంచి డబ్బు పిండు కొంటోందని చెప్పక తప్పదు.

లైఫ్ టాక్స్, గ్రీన్‌ టాక్స్ కాకుండా ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ పేరుతో కూడా రవాణా శాఖ భారీగా పిండేస్తోంది. ఒకవేళ అన్ని సవ్యంగా నిర్ధిష్టమైన ఫీజ్ చెల్లించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందవచ్చు. కానీ ఇది కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కోసమే కనుక రవాణాశాఖ సిబ్బంది వాహనాలకు ఫిట్‌నెస్ పేరుతో వంకలు పెట్టి జరిమానాలు విధించడం పెద్ద కష్టమేమీ కాదని అందరికీ తెలుసు. 

ఆ జరిమానాలు కట్టలేక వాహన యజమానులు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, కార్లు, ద్విచక్ర వాహన యజమానులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండా బళ్ళు నడపాల్సి వస్తోంది. చివరికి ఏదో రోజు పట్టుబడితే ఆ జరిమానాలే వేలు లేదా లక్షల రూపాయలు ఉంటోంది. అంత సొమ్ము చెల్లించలేక, వాహనాలను విడిపించుకోలేక, కొత్తవి కొనుక్కోలేక సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ప్రజా రంజకమైన పాలన అంటే ఇదేనేమో?      Related Post