బంజారాహిల్స్‌లో టిఆర్ఎస్‌ పార్టీకి 4,935 చ.గజాల భూమి కేటాయింపు!

May 12, 2022


img

ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన తెలంగాణ ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బంజారాహిల్స్‌లో సుమారు రూ.100-140 కోట్లు విలువ చేసే 4,935 చదరపు గజాల స్థలాన్ని తమ టిఆర్ఎస్‌ పార్టీకి కేటాయించుకొంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ జీవో జారీ చేశారు. దాని ప్రకారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 12, ఎన్‌బీటి నగర్‌లోని సర్వే నంబర్ 18/పి, 21/పిలో ఉన్న ఆ స్థలాన్ని టిఆర్ఎస్‌ పార్టీకి కేటాయించబడింది. టిఆర్ఎస్‌ పార్టీకి ఇప్పటికే బంజారాహిల్స్‌లోనే 40,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సువిశాలమైన పెద్ద కార్యాలయం ఉంది. ఇప్పుడు దాని కంటే ఇంకా పెద్ద కార్యాలయాన్ని నిర్మించుకోబోతోంది. 

టిఆర్ఎస్‌ కార్యాలయం కోసం టిఆర్ఎస్‌ ప్రభుత్వం కోట్లు విలువ చేసే స్థలం కేటాయించుకొన్నందుకు విమర్శలు ఎదురవుతాయి కనుక టిఆర్ఎస్‌ పార్టీ ఈ స్థలానికి ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలాగే టిఆర్ఎస్‌ పార్టీ కూడా చాలా ధనిక పార్టీ అని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పుకొన్నారు కనుక, ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి ఈ స్థలానికి కొనుక్కోవడం తమకు పెద్ద కష్టం కాదని టిఆర్ఎస్‌ నేతలు వాదించవచ్చు. 

వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చోన్నా పర్వాలేదన్నట్లు టిఆర్ఎస్‌ చేతిలోనే ప్రభుత్వం ఉంది కనుక పార్టీకి స్థలం కేటాయించుకోవడం, దానికి డబ్బు చెల్లించడం పెద్ద సమస్య కానేకాదు.


Related Post