బిజేపీ బలమైనదే కానీ...

May 11, 2022


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ మొదట బీజేపీకే పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ, క్రమంగా ఆ పార్టీకి దూరం అవడమే కాకుండా ఇప్పుడు శత్రువుగా భావిస్తున్నారు. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే ఆయన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ విధానాలను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ పార్టీ పట్ల నేటికీ సానుకూలంగానే మాట్లాడుతూ అది మాత్రమే జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని చెపుతుంటారు. 

మంగళవారం ఓ ఆన్‌లైన్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అయన బిజేపీ, కాంగ్రెస్ పార్టీల గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు. బిజేపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉందని కానీ ఆ బలాన్ని ఉపయోగించుకోకుండా ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోందని, కనుక ఆ పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ బలహీనతగా మారారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ఇన్ని వరుస ఓటముల తరువాత కూడా ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఏవిధంగా వ్యవహరించాలో ఇంకా తెలుసుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తన శక్తిసామర్ధ్యాలను గుర్తించి వినియోగించుకోలేకనే చతికిల పడుతోందని అన్నారు. కానీ నేటికీ దేశంలో బిజేపీకి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీ తన వైఖరిని, విధానాలను సమూలంగా మార్చుకొని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళితే తప్పకుండా సత్ఫలితాలు సాధించగలదని అన్నారు. 

ఆమాద్మీ పార్టీ పంజాబ్‌లో బీజేపీని ఓడించినంత మాత్రాన్న ఆ పార్టీకి ప్రత్యామ్నాయం కాబోదని ప్రశాంత్ కిషోర్‌ అన్నారు.  


Related Post