కేటీఆర్‌ వ్యాఖ్యలపై కొమ్మినేని విమర్శలు...ఇప్పుడెందుకో?

May 10, 2022


img

కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ ఏపీ రోడ్లు, త్రాగునీరు, విద్యుత్‌ పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలపై సాక్షి మీడియాలో పని చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు చురకలు వేస్తూ “మాట జారిన కేటీఆర్‌... తదుపరి సర్దుకొన్నా తప్పని డ్యామేజీ” అనే శీర్షికతో వ్రాసిన ఓ ఆర్టికల్ నిన్న సాక్షి ఆన్‌లైన్‌లో ఎడిషన్‌లో ప్రచురించబడింది. దానిలో మంత్రి కేటీఆర్‌ను, తెలంగాణలో విద్యుత్‌ కోతలు, రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎట్టి చూపుతూ విమర్శించారు. అలాగే హామీలల అమలులో టిఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, గ్రేటర్, దుబ్బాక, హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ ఓటములు వంటి పలు అంశాలు ప్రస్తావించి, ప్రభుత్వం నిజంగా రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీని విమర్శిస్తే టిఆర్ఎస్‌ పార్టీయే నష్టపోతుందని గ్రహించాలని హితవు పలికారు. 

ఆనాడు మంత్రి కేటీఆర్‌ అన్నది ఏపీ ప్రజలను ఉద్దేశ్యించి కాదు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అసమర్ధత లేదా వైఫల్యాల గురించి మాట్లాడారని వేరే చెప్పక్కరలేదు. అయితే ఇప్పుడు అంతా చల్లారిపోయిన తరువాత కొమ్మినేని మళ్ళీ నిప్పు ఎందుకు రాజేస్తున్నారో తెలీదు. బహుశః సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి గట్టి సమాధానం ఇప్పించారేమో?  

మంత్రి కేటీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వం, పాలన, అభివృద్ధి గురించి కొమ్మినేని చేసిన విమర్శలు: 

హైదరాబాద్‌ పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటే చిన్న వర్షానికే రోడ్లు చెరువుల్లా ఎందుకు మారుతుంటాయి?రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు రోడ్లపై గుంతలనే చూడాలో లేదా ప్రజలనే చూడాలో తెలియడం లేదని విమర్శిస్తున్నారు కదా?హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి జాతీయ మీడియాలో సైతం వార్తలు వస్తున్నాయి కదా? గత ఏడాది హైదరాబాద్‌లో వరద బాధితులకు రూ.5,000 చొప్పున ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నికల తరువాత మిగిలిన వారికి ఎందుకు డబ్బు చెల్లించలేదు? 

• ఆనాడు స్వర్గీయ వైఎస్సార్ దూరదృష్టితో నిర్మించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శివారు ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికల కారణంగానే తరువాత నగరంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో రైల్ వంటివి వచ్చాయి. 

• కనుక హైదరాబాద్‌ శతాబ్ధాల తరబడి క్రమంగా అభివృద్ధి చెందింది తప్ప కేవలం 8 ఏళ్లలోనే అభివృద్ధి చెందలేదు. 

• ఒకవేళ 8 ఏళ్లలోనే టిఆర్ఎస్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని భావిస్తే గ్రేటర్ ఎన్నికలలో బిజెపికి 48 సీట్లు ఎందుకు వచ్చాయి? ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా అభివృద్ధి చేసినట్లయితే, దుబ్బాక, హుజూరాబాద్‌ ఉయ్పఎన్నికలలో టిఆర్ఎస్‌ ఎందుకు ఓడిపోయింది?  

• హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో అనధికార విద్యుత్‌ కోతలు విధిస్తూనే ఉన్నారు కదా? 

• తెలంగాణ రైతులు ధాన్యం రోడ్లపై పోసుకొని కొనే నాధుడు లేక గుండెలు ఆవిసేలా రోదిస్తున్న మాట వాస్తవం కాదా?    

• ముఖ్యమంత్రి కావలసిన యువనేత (కేటీఆర్‌) ఆలోచించకుండా పొరుగు రాష్ట్రం గురించి చులకనగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే తన స్థాయి దిగజారుగుతుందని తెలుసుకొంటే మంచిది. 

• తెలంగాణలో స్థిరపడిన ఏపీ ప్రజలు ఈ కారణంగా కేటీఆర్‌పై ఆగ్రహంతో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే ఆ పార్టీయే ఎక్కువ నష్టపోతుంది.  

• ఇన్ని సమస్యలు, లోపాలున్నా తెలంగాణలో అంతా బాగుందని మంత్రి కేటీఆర్‌ చెప్పుకోదలిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉందని చెప్పుకోవడానికి ఏపీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని గ్రహించాలి.

• కనుక మంత్రి కేటీఆర్‌ ఇక ముందు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటే ఆయనకే మంచిది.

కొమ్మినేని ఆర్టికల్ లింక్: https://www.sakshi.com/telugu-news/politics/kommineni-srinivasa-rao-article-ktr-recent-comments-1454906 


Related Post