రాహుల్ రాకతో ఏం జరిగింది?

May 09, 2022


img

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ హడావుడిగా రెండు రోజులు తెలంగాణలో సుడిగాలి పర్యటన చేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా రాష్ట్రంలో ఆయన రాకపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

ఈసారి పర్యటనలో రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ నేతలకు పార్టీ శ్రేణులకు గట్టి సందేశం ఇచ్చారని, దీంతో ఇకపై పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఎదిరించే సాహసం చేయకుండా కట్టడి చేశారని కొందరు చెపుతున్నారు. తమ అధినేత పర్యటనతో సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌లో అందరికీ ముచ్చెమటలు పట్టాయని, అందుకే ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఆయనను విమర్శిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు.    

సిఎం కేసీఆర్‌ సూచన మేరకే రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించారని బండి సంజయ్‌ వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌తో భేటీ అవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ల మద్య రహస్య అవగాహన ఉందని ప్రజలు సైతం అనుమానిస్తున్నారని, ఆ కారణంగా టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు నష్టం కలుగుతుందని భావించిన సిఎం కేసీఆర్‌ తమ మద్య ఎటువంటి రహస్య అవగాహన, పొత్తులు లేవని ప్రకటింపజేయడానికే రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించారని బండి సంజయ్‌ వాదిస్తున్నారు. 

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఒక్క చోట కూడా కాంగ్రెస్‌ను గెలిపించుకోలేకపోయిన రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణలో ఉనికేలేని కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించగలరని టిఆర్ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఓ పోలిటికల్ టూరిస్ట్ మాత్రమే అని ఆయన వచ్చి వెళ్తే వచ్చే నష్టం ఏమీ లేదని వాదిస్తున్నారు.  

అయితే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనతో చివరికి ఏం జరిగింది?అంటే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తోక జాడించవద్దని, జాడిస్తే కత్తిరించేస్తానని రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా హెచ్చరించారు కనుక కనీసం మరో నెలరోజుల వరకు కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తగ్గవచ్చు. ఆ తరువాత మళ్ళీ షరా మామూలే. హనుమకొండ సభలో టిఆర్ఎస్‌తో దోస్తీ లేదని రాహుల్ గాంధీ ప్రకటించారు కనుక కాంగ్రెస్ శ్రేణులలో నెలకొన్న అయోమయం తొలగించారని చెప్పవచ్చు. 


Related Post