రాహుల్ నోట బలిదానాలు...త్యాగాలు!

May 07, 2022


img

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న హనుమకొండ, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో జరిగిన ‘రైతు సంఘర్షణ సభలో తెలంగాణ ఉద్యమాలు, బలిదానాల గురించి ప్రస్తావించారు

తెలంగాణ ఏర్పాటు కోసం అనేకమంది అనేక త్యాగాలు చేశారు. యువత బలిదానాలు చేసుకొన్నారు. ప్రజలు రక్తం చిందించారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షలు గుర్తించి రాష్ట్రం ఏర్పాటుచేశాం. కానీ రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు, ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తే, ఈ ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని రాహుల్ గాంధీ అన్నారు. 

ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజలు పదేళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నా, యువత బలిదానాలు చేసుకొంటున్నా పట్టించుకోలేదు. రాష్ట్ర ఏర్పాటులో పదేళ్ళపాటు తాత్సారం చేసినందునే వందల మంది యువత ప్రాణాలు కోల్పోయారు. కనుక కాంగ్రెస్ పార్టీయే వారందరి చావులకు కారణం. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు వారి పోరాటాలు, త్యాగాల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

2014 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభనష్టాల లెక్కలు కట్టుకొని, తెలంగాణ ఏర్పాటు చేస్తే అక్కడ తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసింది. ఏపీలో తమ పార్టీ నష్టపోతుందని తెలిసినా రాష్ట్రం ఏర్పాటు చేశామని రాహుల్ గాంధీ చెప్పడమే ఇందుకు నిదర్శనం. 

తెలంగాణ ప్రజల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ, తిరిగి 'తెలంగాణ రాష్ట్రం మేమే ఏర్పాటు చేశాము కనుక ప్రజలు మా పార్టీకే ఓటు వేసి ఆ రుణం తీర్చుకోవాలని' చెపుతుండటం సిగ్గు చేటు.   


Related Post