తీన్మార్ మల్లన్న ఆస్తులు ప్రభుత్వానికి ఎందుకు?

May 06, 2022


img

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బిజెపితో మూన్నాళ్ళ హనీమూన్ ముగిసి, మళ్ళీ ఆ గడప తొక్కనంటూ బయటకి వచ్చేసిన తరువాత ‘టీం మల్లన్న-7200’ పేరుతో రాష్ట్రంలో హంగామా మొదలుపెట్టారు. 

గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో ‘7200’ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఇకపై సిఎం కేసీఆర్‌ని, మంత్రులను నేను ఒక్క మాట కూడా అనను. అసలు వారితో నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదం, శతృత్వం లేదు. అయితే ప్రభుత్వ విధానాలలో లోపాలనే నేను ప్రశ్నిస్తున్నాను. టిఆర్ఎస్‌ ప్రభుత్వ పాలనలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగడం లేదు. నిరుపేదలకు విద్యా, వైద్యం అందడం లేదు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అంతే లేదు. యాదాద్రిలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే కొట్టుకుపోవడం ఇందుకు తాజా నిదర్శనం.

ఓ పక్క అకాల వర్షాలతో, గిట్టుబాటు ధరలు లభించక రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సిఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదు. ఇటువంటి సమస్యలపైనే నా పాదయాత్రలో ప్రస్తావిస్తూ ప్రజలలో చైతన్యం కలిగించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చేస్తా. నేను కేవలం రాష్ట్రం, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను. అందుకే నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చేసి రాష్ట్రంలో పాదయాత్ర చేయబోతున్నాను,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌, మంత్రులను తిట్టనంటూనే మళ్ళీ ఈవిదంగా విమర్శలు, ఆరోపణలు చేయడం, ఓ పక్క టిఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతోందంటూ ఆరోపిస్తూనే మళ్ళీ తన ఆస్తులు అదే ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని తీన్మార్ మల్లన్న చెపుతుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. 

అయినా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రభుత్వానికి ఆస్తులు రాసివ్వడం దేనికో అర్ధం కాదు. అంతగా ఆస్తులు రాసిచ్చేయాలనుకొంటే అదేదో ఏ హరేకృష్ణ వంటి స్వచ్ఛంద సంస్థకో రాసిచ్చేయొచ్చు కదా? లేదా తన రాజకీయ ప్రస్థానానికే ఉపయోగించుకోవచ్చు కదా?


Related Post