మళ్ళీ దేశంలో ఖలిస్తాన్ కలకలం..బాంబులతో నలుగురు అరెస్ట్

May 05, 2022


img

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని పంపించి అక్కడి నక్కిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టించారు. అందుకు ప్రతీకారంగా జరిగిన దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగి చాలా దశాబ్ధాలైంది. కానీ దేశంలో మళ్ళీ ఖలిస్తాన్ ఉగ్రవాదం వేళ్లూనుకొంటోంది. 

నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్, హర్యానా పోలీసులు ఈరోజు హర్యానా రాష్ట్రంలో కర్నల్స్ బస్ట్రా టోల్‌గేట్‌ వద్ద ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వాహనాలు తనికీలు చేస్తున్నప్పుడు, ఢిల్లీవైపు వెళుతున్న ఓ తెల్ల ఇన్నోవా కారులో నుంచి భారీగా ప్రేలుడు సామాగ్రి (ఐఈడీలు, ఆర్డీఎక్స్), 30ఎంఎం కాలిబర్ పిస్టల్స్ స్వాధీనం చేసుకొన్నారు. 


ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న పంజాబ్‌కు చెందిన గుర్మీత్, భూపింద‌ర్‌, అమ‌న్‌దీప్‌, ప‌ర్మింద‌ర్‌ అనే నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురికీ పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

పోలీసులు వారిని ప్రశ్నించగా పాకిస్థాన్‌ నుంచి మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీందర్ సింగ్‌ రిండా వాటిని డ్రోన్‌ల ద్వారా భారత్‌లోకి పంపించినట్లు చెప్పారు. వాటితో భారత్‌లో కీలక నగరాలలో ప్రేలుళ్ళు జరిపేందుకు తెలంగాణలో ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు తీసుకు వెళుతున్నట్లు వారు తెలిపారు. 

వాటిలో కొన్ని ఆదిలాబాద్ జిల్లాకు తీసుకువెళ్ళబోతున్నట్లు తెలిసింది కనుక ఇప్పుడు జిల్లాలో ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నారో? ఏమి చేస్తున్నారో? ఏమి కుట్రలు పన్నుతున్నారో? తెలుసుకోవలసిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ పోలీసులపైనే ఉంది. 


Related Post