సొంత పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్‌ పాదయాత్ర?

May 05, 2022


img

ప్రశాంత్ కిషోర్‌ వరుసగా రోజుకో కొత్త మాట చెపుతున్నారు. మొదట కాంగ్రెస్‌లో చేరబోతునట్లు సంకేతాలు ఇచ్చి తరువాత చేరడం లేదని చెప్పేశారు. తరువాత జన్ సూరజ్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి ఇవాళ్ళ పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. అయితే వచ్చే బీహార్ శాసనసభ ఎన్నికల నాటికి పార్టీ పెడతానని చిన్న ట్విస్ట్ ఇచ్చారు. 

ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌, బిజెపిలతో సహా వివిద పార్టీల కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు తను భవిష్యత్‌లో పెట్టబోయే పార్టీ కోసం స్వయంగా సర్వే చేసేందుకు పాదయాత్ర కార్యక్రమం పెట్టుకొంటున్నారు. అక్టోబర్ 2 నుంచి తన సొంత రాష్ట్రమైన బిహార్‌లో 3,000 కిమీ పాదయాత్ర చేసి 17-18,000 మంది ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకోబోతున్నట్లు చెప్పారు. అంటే తన పార్టీ కోసం తనే స్వయంగా సర్వే చేసుకోబోతున్నారన్న మాట! 

గతంలో రాష్ట్రాన్ని పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్, ఇప్పుడు పాలిస్తున్న నితీశ్ కుమార్‌ ఇద్దరూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించలేకపోయారని ప్రశాంత్ కిషోర్‌ అన్నారు. కనుక బిహార్‌ ప్రజల కష్టాలు, అవసరాలు, వారి ఆకాంక్షలు అన్నీ స్వయంగా తెలుసుకొని ఒకవేళ వారు కోరుకొంటే తప్పకుండా పార్టీ పెడతానని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. 

రాజకీయ పార్టీ స్థాపించడం, అధికార పార్టీ ఒత్తిళ్ళు తట్టుకొంటూ దానిని నడిపించడం, ఎన్నికలలో గెలిపించుకోవడం చాలా శ్రమ, ఖర్చుతో కూడిన వ్యవహారాలు. కనుక పార్టీపై పెట్టుబడి పెట్టేముందు రాష్ట్రంలో అందుకు అనుకూల పరిస్థితులున్నాయా లేవా? పెట్టుబడిపై లాభాలు వస్తాయా లేక మునిగిపోతామా? అని తెలుసుకొనేందుకే ప్రశాంత్ కిషోర్‌ ఈ పాదయాత్రతో సర్వే చేసి తెలుసుకోవాలనుకొంటున్నట్లు చెప్పవచ్చు. 


Related Post