వర్షం కురిస్తే విశ్వనగరం నీట మునగాల్సిందేనా?

May 04, 2022


img

ఈరోజు తెల్లవారుజామున సుమారు రెండు గంటలపాటు హైదరాబాద్‌ నగరంలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఇన్నిరోజులుగా తీవ్ర ఎండలు, వడగాడ్పులతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్‌ వాసులకు చాలా ఉపశమనం లభించింది. అయితే ఈరోజు కురిసిన భారీ వర్షానికి యధాప్రకారం నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆ ప్రాంతాలలో వీధులలో కాలువలు నిండిపోయి ఉప్పొంగి రోడ్లపై ప్రవహించాయి.  



నగరంలో పంజగుట్ట, అమీర్ పేట, మొండా మార్కెట్, బాలానగర్, సనత్ నగర్‌, బర్కత్ పురా, సీతాఫల్ మండి, వెస్ట్ మారేడ్ పల్లి, నారాయణగూడ, చంద్రాయణ గుట్ట, పాతబస్తీ తదితర లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు నిలవడంతో ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. 

నగరంలో బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్ పేట, కూకట్‌పల్లి, బాలానగర్, సైదాబాద్ తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారులపై నీళ్ళు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బలమైన ఈదురుగాలులు కూడా వీచడంతో నగరంలో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 

వెంటనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, డిజాస్టర్ మేనేజిమెంట్ బృందాలు రంగంలో దిగి రోడ్లకు అడ్డుగా పడిన చెట్లను కట్ చేసి తొలగించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సాయంతో పోలీసులు మ్యాన్ హోల్స్ క్లియర్ చేసి వరద నీటికి దారి కల్పించారు. అయినప్పటికీ ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాలలో వీధులలో వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. 

హైదరాబాద్‌ నగరంలో ఈ సమస్య అనేక ఏళ్ళుగా ఉన్నదే. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ సమస్యను అసలు పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం ఈ సమస్యను శాస్వితంగా పరిష్కరిస్తుందని రాష్ట్ర పురపాలకశాఖమాత్యులు  కేటీఆర్‌ గత 4-5 ఏళ్ళుగా చెపుతూనే ఉన్నారు. నగరం నీట మునిగినప్పుడల్లా లోతట్టు ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను స్వయంగా  చూసి హామీలు ఇస్తూనే ఉన్నారు. కానీ నేటికీ పరిస్థితిలో మార్పు లేదని నేడు కురిసిన వర్షంతో మరోసారి రుజువైంది. రెండు గంటలు వాన పడితేనే విశ్వనగరం నీట మునిగితే రాబోయే వర్షాకాలంలో పరిస్థితి ఏమిటో? 


Related Post