భక్తుల మొక్కులు..అధికారుల నిర్లక్ష్యం...కోడె దూడల పాలిట శాపం!

May 04, 2022


img

వేములవాడ రాజన్నకు కోడె దూడలను మొక్కు సమర్పించి చెల్లించుకోవడం అనాదిగా వస్తోంది. ఈ ఆనవాయితీతో వేములవాడ ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. కానీ భక్తుల ఈ ఆనవాయితీ, అధికారుల నిర్లక్ష్యం, కోడె దూడల పాలిట శాపంగా మారుతోంది. 

రైతులు కోడె దూడలను కన్నబిడ్డలా సాకుటుంటారు కనుక అవి ఆలయానికి సమర్పించేవారకు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఒకసారి ఆలయానికి అప్పగించిన తరువాత ఆకలితో అలమటించిపోతూ బక్కచిక్కిపోతుంటాయి. కొన్ని మూగజీవాలు ప్రైవేట్ గోశాలకు అక్కడి నుంచి కబేళాలకు తరలిపోతుంటాయి. కన్న బిడ్డలవంటి తమ కోడెదూడలకు ఇటువంటి దుస్థితి ఎదురవుతుందని తెలిసినా భక్తులు ఈ ఆనవాయితీని మానుకోవడం లేదు. దీంతో ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంటుంది కనుక ఆలయ అధికారులు దీనిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 

భక్తులు ఈవిదంగా మొక్కులు చెల్లించుకోవడం తప్పు కాదు. ఆలయ అధికారులు ప్రోత్సహించడం కూడా తప్పు కాదు. కానీ వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో వాటికి రోజూ కడుపు నిండా ఆహారం పెట్టి వాటిని చక్కగా చూసుకొంటే ఇదో గొప్ప ఆనవాయితీగా పేరొందుతుంది. 

కానీ ఆలయ అధికారులకు ఎంత సేపు కోడె దూడల మొక్కులతో వచ్చే ఆదాయంపైనే దృష్టి తప్ప వాటికి ఆహారం అందించాలనే ధ్యాసే లేకపోవడంతో అవి ఆకలితో అలమటించిపోతున్నాయి. దాంతో భక్తులు పెట్టే అరటిపళ్ళు, తమ మెడలో వేసే పూల దండలను తింటూ నీరసించి పోతున్నాయి. అయినా ఆలయ అధికారులకు వాటిపై జాలి కలుగడం లేదు. పైగా కోడె దూడలను సమర్పించలేని వారి కోసం రూ.200 టికెట్ పెట్టి ఆలయంలో ఉన్న కోడె దూడలనే వారి చేత ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయిస్తున్నారు కూడా. ఆకలితో అలమటించిపోతూ నడవలేని పరిస్థితిలో ఉన్నవాటితో కూడా ఆదాయం సమకూర్చుకొంటున్నారు కానీ వాటికి కడుపు నిండా ఇంత పచ్చగడ్డి, దాణా పెట్టాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరం. గోవుల సంరక్షణపై పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు మాట్లాడే బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, గోరక్షణ పేరుతో హడావుడి చేస్తే సంస్థలు, జంతు ప్రేమికులు, తెలంగాణ ప్రభుత్వం అందరూ కూడా ఈ మూగ జీవాల దుస్థితిని గమనించి వాటిని కాపాడవలసిన బాధ్యత ఉంది. 


Related Post