సిద్ధిపేటలో కెఏ పాల్‌పై టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి

May 02, 2022


img

ఈరోజు మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్‌పై టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన రాజన్న సిరిసిల్లా జిల్లాలో తంగళ్ళపలి మండలం బస్వాపూర్ గ్రామంలో అకాల వర్షాల కారణంగా  పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. 

ఈరోజు మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు ఆయన జక్కాపూర్ చేరుకొన్నప్పుడు పోలీసులు ఆయనను అడ్డుకొని హైదరాబాద్‌ తిప్పి పంపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఈ విషయం తెలుసుకొని టిఆర్ఎస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వారూ కెఏ పాల్‌ను అడ్డుకొన్నారు. కెఏ పాల్‌ పోలీసులతో మాట్లాడుతుండగా హటాత్తుగా టిఆర్ఎస్‌ కార్యకర్తలలో ఒకరు ముందుకు తోసుకువచ్చి డీఎస్పీ ఎదుటే  కెఏ పాల్‌కు చెంపదెబ్బ కొట్టారు. వెంటనే కెఏ పాల్‌ వెంట ఉన్నవారు, పోలీసులు అతనితో సహా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

మీడియా, డీఎస్పీ ఎదుటే ఈ ఘటన జరగడంతో కెఏ పాల్‌ టిఆర్ఎస్‌ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత డీఎస్పీ ఆయనను సముదాయించి హైదరాబాద్‌ తిప్పి పంపించేశారు. 

ప్రభుత్వాని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశ్నిస్తే తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిందని ఆమె రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలు సుద్దులు చెపుతుంటారు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు పర్యటించడానికి వీలులేకుండా ఎక్కడికక్కడ పోలీసుల చేత అడ్డుకోవడం, టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడులు చేస్తుండటాన్ని టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఏవిదంగా సమర్ధించుకోగలదు?ఇదేనా టిఆర్ఎస్‌ గొప్పగా చెప్పుకొంటున్న ప్రజాస్వామ్యం? టిఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్నవారు రాష్ట్రంలో తిరుగలేని పరిస్థితులు నెలకొన్నాయంటే అర్ధం ఏమిటి?

 


Related Post