ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి పేరు జన్ సూరజ్?

May 02, 2022


img

మొదట కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌, తరువాత ఆ పార్టీలో చేరదలచుకోలేదని ప్రకటించడంతో ఆయన భవిష్య కార్యాచరణ ఏవిదంగా ఉంటుందో అని యావత్ దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఆతృతగా ఎదురుచూస్తుండగా ఆయన  ‘జన్ సూరజ్’ అనే సొంత కుంపటి పెట్టుకోబోతున్నట్లు ప్రకటించి బాంబు పేల్చారు.   

“దేశంలో ప్రజాస్వామ్యబద్దమైన, ప్రజామోదమైన ప్రభుత్వాల ఏర్పాటులో నేను కూడా అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే ప్రయత్నంలో గత పదేళ్ళుగా వాటితో కలిసి రోలర్ కోస్టర్‌లా కిందకీ పైకి ప్రయాణించాను. ఇప్పుడు పేజీ తిరగేసి, నిజమైన యజమానులు అంటే ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అర్ధం చేసుకొని ‘జన్ సూరజ్’ (ప్రజాకాంక్షల మేరకు సమర్ధంగా పనిచేసే పాలన) వైపు నడవడం అవసరమని భావిస్తున్నాను,” అని ప్రశాంత్ కిషోర్‌ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. 


ఆయన ట్వీట్ సారాంశం ఏమిటంటే, “ప్రజల ఆకాంక్షల మేరకు సమర్ధంగా పనిచేసే పాలన అందించేందుకు ‘జన్ సూరజ్’ అనే ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, దాంతో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించబోతున్నానని!

ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సొంత కుంపటి పెట్టుకొంటే అదేమి విశేషం కాబోదు. కానీ ఇంతకాలం దేశంలో ప్రజాస్వామ్యబద్దమైన, ప్రజామోదమైన ప్రభుత్వాల ఏర్పాటు చేసే పేరుతో ఎన్నికలను వ్యాపారంగా మార్చి రాజకీయ పార్టీల నుంచి వందల కోట్లు ఫీజు గుంజి, మీడియాలో, ప్రజలలో, పార్టీల నాయకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, పలుకుబడి పెంచుకొని, ఆ డబ్బు, పరిచయలు, పలుకుబడిని ఉపయోగించుకొని సొంత కుంపటి పెట్టుకొని దాంతో వాటికే ఎసరు పెట్టేందుకు సిద్దపడుతుండటం గమనిస్తే ప్రశాంత్ కిషోర్‌ ఎటువంటి వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకాలం మా రాజకీయ పార్టీలన్నీ అటువంటి వ్యక్తిని నమ్ముకొని గోదావరి దాటుతున్నామనే భ్రమలో ఉన్నాయి తప్ప అతనికి తమ పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసేందుకు తామే తమ పార్టీ రహస్యాలన్నిటినీ చేజేతులా అతని చేతిలో పెడుతున్నామని గ్రహించలేకపోయాయి. ఇప్పుడు జనులకు వెలుతురు నిచ్చే సూర్యుడు ‘జన్ సూరజ్’తో జనాలని కాల్చుకు తింటారేమో? 


Related Post