తెలంగాణలో మరో కొత్త పార్టీ!

May 02, 2022


img

తెలంగాణ రాష్ట్రంపైన చాలా పార్టీలు కన్నేయడమే కాక కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం, పార్టీ చాలా బలంగా సుస్థిరంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని భావిస్తూ పార్టీలు పుట్టుకొస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

తాజాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌లోనే ఆయన బిజెపిలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక బయటకువచ్చేశారు. మళ్ళీ జన్మలో బిజెపి గడప తొక్కనని చెప్పారు. 

ఆదివారం మేడ్చల్ జిల్లా ఘాట్‌కేసర్‌ మండలంలోని కొర్రెముల గ్రామంలో తీన్మార్ మల్లన్న ‘మల్లన్న టీం-7,200’ పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 7,200 మంది రాజకీయ దొంగలున్నారని వారి భరతం పట్టేందుకే ఈ పేరుతో టీంను ఏర్పాటు చేసుకొన్నానని చెప్పారు. ఈ ‘మల్లన్న టీం-7,200’ బిజెపి కంటే బాగా పనిచేస్తుందని చెప్పారు. 

కొత్త పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించే ముందు తన ఆస్తులన్నిటినీ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని తీన్మార్ మల్లన్న మరో సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ నగరంలో 10 లక్షల మందితో భారీ బహిరంగన సభ నిర్వహిస్తానని నిన్ననే ప్రకటించారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి, బీఎస్పీ, వామపక్షాలు కాకుండా తెలంగాణ జనసమితి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఇంకా మరి కొన్ని చిన్న పార్టీలున్నాయి. వాటిలో వామపక్షాలు, తెలంగాణ జనసమితి తప్ప మిగిలిన అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలలో తప్పకుండా తామే గెలిచి అధికారంలోకి రాబోతున్నామని గట్టిగా వాదిస్తున్నాయి. ఇన్ని పార్టీలు అధికారం కోసం పోటీ పడుతుండగా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్దపడుతుండటం ఆశ్చర్యకరమే.  



Related Post