కాంగ్రెస్‌ మారదు... మారితే కాంగ్రెస్‌ కాదు!

April 30, 2022


img

పది రోజుల క్రితమే రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఢిల్లీకి పిలిచి మొట్టికాయలు వేసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గట్టిగా హెచ్చరించి పంపారు. అప్పుడు ఆయన ముందు షేక్‌ హ్యాండ్స్ ఇచ్చుకొన్న నేతలు, హైదరాబాద్‌ తిరిగి రాగానే మళ్ళీ కీచులాటలు మొదలుపెట్టేశారు. 

మే 6,7 తేదీలలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించబోతుండటంతో, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వాటిలో మే 6న వరంగల్‌లో రాహుల్ గాంధీ పాల్గొనబోయే సభకు ఏర్పాట్లు, జనసమీకరణ గురించి చర్చించుకొన్నారు. 

శుక్రవారం నల్లగొండలో సన్నాహక సమావేశం నిర్వహించాలనుకొన్నారు. అయితే ఈ విషయం జిల్లా నేతలైన ఎంపీలు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత కె.జానారెడ్డిలకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో సమావేశాన్ని వాయిదా వేయించేందుకు ప్రయత్నించారు. 

దీంతో రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడిగా  మెలుగుతున్న అద్దంకి దయాకర్ స్పందిస్తూ, “పిసిసి అధ్యక్షుడు జిల్లాలలో పర్యటనకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఆయనను అడ్డుకొనే హక్కు కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికీ లేదు,” అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశ్యించి అన్నారు. 

దీంతో కోమటిరెడ్డి మరింత ఆగ్రహంతో నిన్న జరిగిన ఆ సమావేశానికి వెళ్లలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో ఏకపక్షంగా వ్యవహరించడం తగదు. అయినా జిల్లా నేతలమైన మాకు మాట మాత్రంగా జిల్లాలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా?జిల్లాలో పార్టీ బలంగానే ఉంది. కనుక పార్టీ బలహీనంగా ఉన్న నిజామాబాద్‌లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేది,” అని అన్నారు.   

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌ నేత, రేవంత్‌ రెడ్డి సన్నిహితుడు మధూ యాష్కీ స్పందిస్తూ, “నల్గొండలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నట్లయితే ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ హుజూర్ నగర్‌లో శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయింది? వాపును చూసి బలుపు అనుకోవడం వలననే కదా?” అంటూ నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశ్యించి సెటైర్ వేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుంటే, కాంగ్రెస్‌ నేతలు ఈవిదంగా కీచులాడుకొంటూ తమ అనైఖ్యతను తమ అధిష్టానానికి, తమ ప్రత్యర్ధులైన టిఆర్ఎస్‌, బిజెపిలకు ఎలుగెత్తి చాటుతుండటం విశేషం. 

కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదు...ఒకవేళ మారితే అది కాంగ్రెస్ పార్టీ కాదనుకోవలసిందే! 


Related Post