కేసీఆర్‌, ప్రశాంత్ కిషోర్‌... భారత్‌ రాష్ట్ర సమితి?

April 29, 2022


img

మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని, కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌ వచ్చి సిఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత ఆయన ఏమి చెప్పారో కానీ, వెంటనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్‌ ప్రకటించేశారు. 

ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నా అవసరం కూడా లేదని చెప్పడం విశేషం. నిన్న ఓ జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌కు తన కాళ్ళపై తాను నిలబడగల సామర్ధ్యం ఉంది. ఆ పార్టీలో చాలా మంది హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. కనుక ఆ పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో చాలా మార్పు కనిపిస్తోంది. దాదాపు 8 ఏళ్ళు తరువాత భవిష్య ప్రణాళికలు, కార్యాచరణ గురించి ఆలోచిస్తోంది. ఆ పార్టీ మేలు కోసం ఏమేమి చేయాలో నేను చెప్పవలసినవన్నీ చెప్పేశాను. నన్ను కాంగ్రెస్‌లో చేరమని ఆహ్వానించిన మాట వాస్తవం కానీ నాకు కొన్ని అనుమానాలు ఉన్నందున చేరలేనని చెప్పాను,” అని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. 

కాంగ్రెస్‌ని కలుపుకోకుండా జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కొని నిలవడం కష్టమని గట్టిగా వాదించిన ప్రశాంత్ కిషోర్‌, ఇప్పుడు ఆ పార్టీకే దూరం అవడం ఆశ్చర్యకరం. ఓ పక్క ఈవిదంగా కాంగ్రెస్‌-ప్రశాంత్ కిషోర్‌ సీరియల్ నడుస్తుండగానే, మరోపక్క సిఎం కేసీఆర్‌ ప్లీనరీ సమావేశంలో ‘భారత్‌ రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతునట్లు సంకేతం ఇవ్వడం గమనిస్తే, ప్రశాంత్ కిషోర్‌, సిఎం కేసీఆర్‌ కలిసి ఆ కొత్త పార్టీతో కోసం పనిచేసేందుకే కాగ్రేస్ పార్టీలో చేరడానికి నిరాకరించారా? అందుకే ఇప్పుడు ఆ పార్టీకి నా అవసరం లేదని చెపుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. త్వరలోనే దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


Related Post