గులాబీ కారుపై మోజుపడుతున్న ఐఏఎస్ అధికారులు

April 28, 2022


img

ఏపీలో ఐఏఎస్ అధికారులు తమపై ఎప్పుడు ప్రభుత్వం వేటు వేస్తుందో, ఎప్పుడు కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుందో అని బిక్కుబిక్కుమని భారంగా రోజులు వెళ్ళదీస్తుంటే, తెలంగాణలో ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొనడం విశేషం. తమ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తూ నిఖచ్చిగా తమ పని చేసుకుపోతే చాలు...సిఎం కేసీఆర్‌ నుంచి మంచి గుర్తింపు, గౌరవమర్యాదలు, వీలైతే పదవీ విరమణ మళ్ళీ ఏదో ఓ పదవిలో నియమితులవడం, ఇంకా మెప్పించగలిగితే టిఆర్ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు పొందే అవకాశం కూడా వారికి ఉంది. 

ఇందుకు ఉదాహరణగా సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా మన కళ్లెదుటే ఉన్నారు. సిఎం కేసీఆర్‌ ఆయన చేత పదవికి రాజీనామా చేయించి, టిఆర్ఎస్‌లో చేర్చుకొని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపారు. తాజాగా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్.శర్మన్ కూడా త్వరలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరానున్నారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. వెంటనే గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు తాజా సమాచారం. నిత్యం ప్రజల మద్యే ఉంటూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న ఆయన పట్ల సిఎం కేసీఆర్‌కు కూడా చాలా గౌరవం ఉంది. కనుక టిఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకొనేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ టికెట్ ఇస్తే, ఆదిలాబాద్ లోక్‌సభ లేదా ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడో అక్కడ పోటీ చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. .          

ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఏదో ఓ పార్టీ వైపు మొగ్గు చూపడం సహజం కానీ తెలంగాణలో ఐఏఎస్ అధికారులు కూడా వీలు వెంబడి గులాబీ కండువాలు కప్పుకొని గులాబీ కారులో ఎక్కాలనుకొంటుండటమే విశేషం.


Related Post