రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధోనీ భార్య

April 26, 2022


img

టీమిండియా మాజీ కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్‌కు తమ ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంపై పట్టరాని కోపం వచ్చింది. రాష్ట్రంలో ఓ పక్క రోజురోజుకీ ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిత్యం విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో ఆమె ట్విట్టర్‌ వేదికగా తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “రాష్ట్రానికి పన్నులు చెల్లిస్తున్న వ్యక్తిగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈనేళ్ళుగా రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఎందుకు నెలకొని ఉంది?మా బాధ్యతగా మేము పొదుపుగా విద్యుత్‌ వాడుకొంటున్నాము,” అని ట్వీట్ చేశారు. 

నిజానికి ఈ సమస్య చాలా రాష్ట్రాలలో ఉంది. సరిగ్గా రెండేళ్ళ క్రితమే దేశంలో భారీగా మిగులు విద్యుత్‌ ఉందంటూ ధర్మల్ విద్యుత్‌ ఉత్పత్తి (బొగ్గుతో నడిచే ప్లాంట్స్)పై కేంద్రప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విద్యుత్‌ సమస్యను శాస్వితంగా పరిష్కరించేశాం. ఇక ఎన్నటికీ విద్యుత్‌ సంక్షోభం ఉండదని, ఇదంతా మా గొప్పదనమే అని గొప్పలు చెప్పుకొన్నాయి. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం, సరైన విధానాలు పాటించకపోవడం, విద్యుత్‌ ఉత్పత్తి , పెరిగే డిమాండ్‌లను సరిగ్గా అంచనావేయలేక, అందుకు తగ్గట్లు కొత్త ప్లాంట్స్ నిర్మించుకొంటూ విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోవడం, నడుస్తున్న ప్లాంట్లకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోవడం వంటి అనేక ఇతర కారణాల వలన దేశంలో మళ్ళీ విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. కనుక సాక్షి సింగ్‌ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లే ఇతర రాష్ట్రాలలో ప్రజలు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ స్పందించేవారే లేరు. ఒకవేళ స్పందించినా ఏవో కుంటిసాకులు చెపుతారు కానీ విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించడం చేతకావట్లేదు.


Related Post