పీకే ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలలో కలకలం

April 25, 2022


img

కాంగ్రెస్ పార్టీని ప్రశాంత్ కిషోర్‌ కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తారో రారో తెలీదు కానీ ఆయన రాకతో సంతోషించవలసిన తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చెందుతోంది. కారణం తెలిసిందే. ఆయన తమ అధిష్టానంతో భేటీ అయిన తరువాత హైదరాబాద్‌ వచ్చి సిఎం కేసీఆర్‌తో వరుసగా రెండు రోజులు భేటీ అవ్వడమే. 

దీంతో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆందోళన, అయోమయం చెందుతుంటే, రాష్ట్ర బిజెపి నేతలు ఇదే అదునుగా కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌లపైవిమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 

బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్ స్పందిస్తూ, “కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్య రహస్య అవగాహన ఉందని మేము మొదటి నుంచే చెపుతున్నాము. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌-కేసీఆర్‌ భేటీతో అది రుజువైంది. ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. దానిలో భాగంగానే సిఎం కేసీఆర్‌తో నిన్న, మొన్న భేటీ అయ్యారు. దాంతో మొన్నటి వరకు కాంగ్రెస్‌ను కలుపుకోకుండా జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పుకొన్న సిఎం కేసీఆర్‌, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్దం అవుతున్నారు. ప్రశాంత్ కిషోర్‌ ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు రెంటినీ దగ్గర చేసి వాటికోసం పనిచేయబోతున్నారు. 

రాష్ట్రంలో బిజెపికి నానాటికీ ఆదరణ పెరుగుతున్నందునే సిఎం కేసీఆర్‌ మద్యలో ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు కూడా సిద్దపడుతున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్‌, ప్రశాంత్ కిషోర్‌ల వ్యూహాలు, ఎత్తుగడలు పనిచేయవు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కేసీఆర్‌ పట్ల విసుగెత్తిపోయున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓటమి, బిజెపి గెలుపు ఖాయం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరిని తెచ్చుకొన్నా లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించలేదు. మళ్ళీ భారీ మెజార్టీతో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి ఇప్పటికే దయనీయంగా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ రాకతో వారి పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారవచ్చు. ఒకవేళ ఆయన టిఆర్ఎస్‌ కోసం మాత్రమే పనిచేస్తే అప్పుడు రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపిలతో పాటు ప్రశాంత్ కిషోర్‌ను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ టిఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలని అధిష్టానం ఆదేశిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 

తెలంగాణ బిజెపికి కూడా ప్రశాంత్ కిషోర్‌ రాకతో ఇబ్బందులు తప్పవు. ఇప్పటి వరకు కేసీఆర్‌ ఒక్కరే. ఇప్పుడు ఆయనకు ప్రశాంత్ కిషోర్‌ తోడైతే వారిని ఎదుర్కోవడం బిజెపికి చాలా కష్టమవుతుంది.  


Related Post