ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్‌ భేటీ: టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో అయోమయం

April 25, 2022


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ ఓ వైపు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు, వీలైతే ఆ పార్టీలో చేరేందుకు సిద్దపడుతూనే, మరోవైపు తెలంగాణలో టిఆర్ఎస్‌ తరపున సర్వేలు చేసి, సిఎం కేసీఆర్‌తో భేటీ అవుతుండటంతో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతలలో తీవ్ర అయోమయం నెలకొంది. 

శని ఆదివారాలు రెండు రోజులు వారు ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్‌ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికను కేసీఆర్‌కు అందజేసి, వారిలో కొందరిని మార్చక తప్పదని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌ను కలుపుకోకుండా జాతీయస్థాయిలో బిజెపిని ఢీకొనడం సాధ్యం కాదని తేల్చి చెప్పగా, కాంగ్రెస్‌ లేకుండానే కూటమి ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే ఇద్దరి లక్ష్యం బిజెపిని గద్దె దించడమే కనుక ఏదో విదంగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించగలిగితే, ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌ సహకరిస్తే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్‌ సూచించినట్లు తెలుస్తోంది. 

ఇక తెలంగాణలో ఆయన సర్వేలు చేసి, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీని గెలిపించుకొనేందుకు సిఎం కేసీఆర్‌కు సహకరిస్తుండటం, మరోపక్క జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పనిచేస్తుండటంతో రాష్ట్రంలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. 

టిఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని పక్కన పెట్టాలని ఆయన సిఎం కేసీఆర్‌ సూచించినట్లు వస్తున్న వార్తలతో వారిలో ఆందోళన మొదలైంది. 

ఓ పక్క కాంగ్రెస్‌ కోసం పనిచేస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రశాంత్ కిషోర్‌ టిఆర్ఎస్‌కు సహకరిస్తుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కూడా అయోమయం నెలకొంది. కనుక ప్రశాంత్ కిషోర్‌, కేసీఆర్‌తో భేటీ అవుతున్నా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడలేని పరిస్థితిలో ఉండగా, ప్రశాంత్ కిషోర్‌ తమ రాజకీయ జీవితాలతో ఆడుకొంటున్నాడని టిఆర్ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. 

ఒక నిర్ధిష్టమైన విధానం లేకుండా, డబ్బు, పరపతి కోసం ఎన్నికలను రాజకీయ వ్యాపారంగా మార్చి కేసీఆర్‌, మమతా బెనర్జీ, జగన్, సోనియా, రాహుల్ గాంధీ వంటి హేమాహేమీలను తన గుప్పెట్లో పెట్టుకొని ఆడుకొంటుంటే, వారు కూడా తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడం కోసం ప్రశాంత్ కిషోర్‌కి దాసోహం అంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post