షర్మిల, ప్రవీణ్ కుమార్‌ టిఆర్ఎస్‌ కోసమే బరిలో దిగారా?

April 23, 2022


img

మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా, “రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో అందరికీ తెలుసు. వాటి నేతలు రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎంత గొంతు చించుకొన్నా ఆ రెండు పార్టీలకు ఇప్పుడు ఉన్నన్ని సీట్లే రావచ్చు. వచ్చే ఎన్నికలలో బహుశః ఆ రెండు పార్టీలో 11, 12స్థానాలలో మిగిలిపోవచ్చు. వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్‌ పార్టీలు రెండు మూడు స్థానాలలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ మేము మొదటి నుంచి ప్రజలనే నమ్ముకొని వారి ఆంక్షలకు అనుగుణంగా పనిచేసుకుపోతున్నాము. కనుక వచ్చే ఎన్నికలలో మేము మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ నోట మొట్టమొదటిసారిగా వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్‌ పేర్లు వినిపించడం యాదృచ్చికమనుకోలేము. వైఎస్ షర్మిల తెలంగాణలో నాటకీయ ప్రవేశం, పాదయాత్రల పేరుతో చేస్తున్న హడావుడిపై ప్రజలు మొదటి నుంచి అనుమానంగానే చూస్తున్నారు. ఆమె సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నా టిఆర్ఎస్‌ అసలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌, బిజెపిల దీక్షలకు అనుమతి నిరాకరించే పోలీసులు ఆమె దీక్షలకు, పాదయాత్రలకు అభ్యంతరం చెప్పడం లేదు? కనుక టిఆర్ఎస్‌కు ఆమె పార్టీకి మద్య ఏదో రహస్య అవగాహన ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. 

తెలంగాణ ప్రభుత్వంలో, పార్టీలో సిఎం కేసీఆర్‌ తరువాత రెండో స్థానంలో ఉన్న మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ “ఆమె రెండో స్థానంలోకి వస్తారేమో?”అని అనడం చూస్తే ఆ అనుమానాలు నిజమే అనిపించకమానదు. 

ఇక తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా పనిచేసిన ఆర్‌ ప్రవీణ్ కుమార్‌ ఇంకా ఆరేళ్ళ సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్రంలో కనబడని పార్టీ బిఎస్పీలో చేరి “వచ్చే ఎన్నికలలో గెలిచి ఏనుగుపై  ఎక్కి ప్రగతి భవన్‌లోకి ప్రవేశిద్దాం...” అంటూ ఒకటే హడావుడి చేస్తున్నారు. 

కేటీఆర్‌ చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు బహుశః ఆయన కూడా కేసీఆర్‌ వ్యూహంలో భాగంగానే ఉద్యోగం వదిలి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారా? షర్మిల, ప్రవీణ్ ఇద్దరూ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బ తీయడానికి, ఒకరు రాష్ట్రంలో బలమైన ఓ వర్గం, క్రీస్టియన్ ఓటర్లను, మరొకరు దళిత ఓటర్లను ఆకర్షించడానికి, ఎన్నికల తరువాత అవసరమైతే టిఆర్ఎస్‌కు ఉపయోగపడతారని వారిని సిఎం కేసీఆరే బరిలో దింపారేమో? అందుకే పోలీసులు, టిఆర్ఎస్‌ కార్యకర్తలు వారి జోలికి వెళ్ళడం లేదేమో? ఏమో?


Related Post