మంత్రులు పువ్వాడ, కేటీఆర్‌ స్పందన చాలా విడ్డూరంగా ఉందే

April 23, 2022


img

ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి హైకోర్టు నోటీస్ జారీ చేసింది. రాష్ట్ర బిజెపి నేతలు ఇటీవల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసి ఫిర్యాదు చేయడంతో ఆమె దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు తెలుస్తోంది. 

వీటిపై మంత్రి పువ్వాడ  స్పందన చాలా విచిత్రంగా ఉంది. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాలో కమ్మ సామాజికవర్గం అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “నేను కమ్మ కులస్థుడిని కనుకనే కొందరు నన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. ఏపీలో ఏకైక కమ్మ మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా ఈవిదంగానే కొందరు రాజకీయ కుట్రలు చేయడంతో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక కమ్మ మంత్రిని నేనే కనుక ఇప్పుడు నన్ను టార్గెట్‌గా చేసుకొని కుట్రలు చేస్తున్నారు. కనుక కమ్మ సామాజికవర్గం ఐక్యంగా నిలబడి ఈ కుట్రలను ఎదుర్కోవలసి ఉంది,” అని అన్నారు. 

ఇది కుట్రే అయితే దానిని ఏవిదంగా ఎదుర్కోవాలో టిఆర్ఎస్‌కు బాగా తెలుసు. ఒకవేళ బిజెపి ఆరోపిస్తున్నట్లు మంత్రి పువ్వాడ ఒత్తిళ్ళ కారణంగానే ఖమ్మం పోలీసులు బిజెపి కార్యకర్త సాయి గణేశ్‌పై తప్పుడు కేసులు బానాయించి వేధించి అతని ఆత్మహత్యకు కారణమైతే ఆయన న్యాయపోరాటం చేసి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ మద్యలో ఈ  కేసుతో సంబందం లేని తన కమ్మకుల ప్రస్తావన ఎందుకు?

మంత్రి కేటీఆర్‌ కూడా పువ్వాడపై వస్తున్న ఈ ఆరోపణలపై చాలా విచిత్రంగా స్పందించారు. ఆయన మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “నేను బండి సంజయ్‌ ఎవరో మహిళను రేప్ చేశాడని, రేవంత్‌ రెడ్డి ఎవరినో హత్య చేశారని ఆరోపిస్తాను. వెంటనే వారి పార్టీలు వారిని ఆ పదవులలో నుంచి తొలగిచేస్తాయా?పోలీసులు వారిపై కేసులు పెట్టేసి జైలుకి పంపించేస్తారా?నిజానికి బిజెపి నేతలే తమ కార్యకర్త సాయి గణేశ్‌ను రెచ్చగొట్టి చివరికి ఆత్మహత్య చేసుకొనేలా చేసి దానికి పువ్వాడని దోషిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బిజెపి నేతలు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం? అని ప్రశ్నించారు.

అయితే సాయి గణేశ్‌పై పోలీసులు 10 కేసులు పెట్టడం, రౌడీ షీట్ ఓపెన్ చేసి వేధించడం నిజం కాదా?వాటినీ బిజెపి నేతలే పెట్టించుకొన్నారా?పోలీసులు, మంత్రి పువ్వాడ అనుచరుల వేదింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకొంటున్నానని సాయి గణేశ్‌ ఇచ్చిన మరణ వాంగ్మూలంపై టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఏమని సమాధానం చెపుతుంది?


Related Post