మజ్లీస్‌ పార్టీయే మాకు ప్రతిపక్షం: కేటీఆర్‌

April 22, 2022


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఓ ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, వచ్చే ఎన్నికలలో మీ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా దేనిని పరిగణిస్తారు? బిజెపినా లేక కాంగ్రెస్ పార్టీనా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ ఊహించని సమాధానం చెప్పారు. 

“రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎప్పుడో ఉనికి కోల్పోయింది. ఇక బిజెపి వాపును చూసి బలుపు అనుకొంటోంది. కనుక ఆ రెండు పార్టీలకు ఇప్పుడు ఉన్నన్ని సీట్లు వస్తాయో రావో కూడా తెలీదు. ఒకటి రెండు సీట్లు గెలుచుకొని మీడియా ఎదుట గొంతు చించుకొని సిఎం కేసీఆర్‌ను విమర్శించినంత మాత్రన్న ఆ రెండు పార్టీలకు ప్రజాధారణ పెరిగిందనుకోలేము.         వచ్చే ఎన్నికలలో కూడా మజ్లీస్‌ పార్టీ వాటి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొంటుంది కనుక దానినే మేము ప్రతిపక్షంగా భావిస్తాము,” అని చెప్పారు.

అయితే మజ్లీస్‌, టిఆర్ఎస్‌ పార్టీలు మిత్రపక్షాలుగా ఉంటున్నాయి కనుక రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదనుకోవాలేమో?గతంలో కాంగ్రెస్ పార్టీని తమ ప్రధాన ప్రత్యర్ధిగా టిఆర్ఎస్‌ చెప్పుకొనేది. అది బలహీనపడి దాని స్థానంలోకి బిజెపి ప్రవేశించిన తరువాత నిత్యం బిజెపి నామస్మరణ చేస్తోంది. అయితే రాష్ట్రంలో బిజెపి క్రమంగా బలపడుతోంది కనుక దానిని తమ ప్రత్యర్ధిగా పేర్కొని బిజెపి స్థాయిని ఇంకా పెంచడం ఇష్టం లేకనే మంత్రి కేటీఆర్‌ ఈవిదంగా అన్నారేమో? 


Related Post