టిఆర్ఎస్‌ ప్రభుత్వంతో యుద్ధానికి గవర్నర్‌ తమిళి...సై?

April 22, 2022


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం కేసీఆర్‌ల మద్య పాడి కౌశిక్ రెడ్డితో మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌గా నామినేట్‌ అయిన ఆమె అధికారాలు పరిమితమని, వాటికి లోబడి ఆమె పనిచేయాలని కానీ ఆమె తన పరిధిని అతిక్రమించి ప్రెస్‌మీట్లు పెడుతూ బిజెపి నేతలాగా మాట్లాడుతున్నారని అన్నారు.

సిఎం కేసీఆర్‌ అనుమతి లేనిదే మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ గవర్నర్‌ను ఉద్దేశ్యించి ఈవిదంగా మాట్లాడే సాహసం చేయరు. కనుక సిఎం కేసీఆర్‌ సూచన ప్రకారమే వారు మాట్లాడుతున్నట్లు భావిస్తున్న ఆమె ఇక నుంచి కేసీఆర్‌ ప్రభుత్వానికి తన పరిధి, పవర్ ఏమిటో  చూపాలని నిర్ణయించుకొన్నట్లున్నారు. అందుకే ఆమె కాళోజీ యూనివర్సిటీ వైస్‌-ఛాన్సిలర్‌కు లేఖ వ్రాసి యూనివర్సిటీ పరిధిలో గల మెడికల్ కాలేజీలలో సాగుతున్న పీజీ మెడికల్ సీట్ల దందా గురించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఇటీవల ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్యలు, భువనగిరిలో రామకృష్ణ అనే మాజీ హోంగార్డు హత్యల గురించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైనవే అని వేరే చెప్పక్కరలేదు. అయితే గవర్నర్‌ తమిళిసై ఆదేశాలను కాళోజీ యూనివర్సిటీ, ప్రభుత్వం పట్టించుకొంటాయా లేదా? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు ఆమె ఏమి చేస్తారు?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 


Related Post