తెలంగాణలో ప్రశాంత్ కిషోర్‌ వ్యూహం ఏమిటో?

April 22, 2022


img

ఈరోజు ఈనాడు మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయబోతున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌, కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో వైసీపీతో పొత్తులు పెట్టుకోవాలని కానీ తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోరాడాలని సూచించినట్లు ఈనాడు పేర్కొంది. 

అయితే ప్రశాంత్ కిషోర్‌ తమతో కలిసి పనిచేస్తున్నారని సిఎం కేసీఆర్‌ స్వయంగా ఇదివరకే చెప్పారు. కానీ ఆ తరువాత ఆయన ఢిల్లీ వెళ్ళి సిఎం కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఒకవేళ ఈనాడులో వచ్చిన వార్త నిజమనుకొంటే, తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుంది కనుక ఆయన దాని తరపున పనిచేసి టిఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. 

ఒకవేళ ఆయన కేసీఆర్‌ను దూరం చేసుకోకూడదని భావిస్తే తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయన దూరంగా ఉండక తప్పదు. అప్పుడు ప్రశాంత్ కిషోర్‌ వంటి మేధావి హస్తం చేతిలో ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకపోవచ్చు. 

కానీ ఇదివరకు ఆయన సిఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా జాతీయ స్థాయిలో బిజెపిని ఎదిరించగల కూటమి నిలబడదని స్పష్టంగా చెప్పారు. కనుక ఆయన కాంగ్రెస్‌ పంచనచేరి దానికి మిత్రాపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఒకవేళ టిఆర్ఎస్‌ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు అంగీకరిస్తే, అప్పుడు వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్య ఎనికల పొత్తులు కుదిర్చి వాటి తరపున ఆయన పనిచేయవచ్చు. 

సిఎం కేసీఆర్‌ కూడా తన కుమారుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నారు కనుక ప్రశాంత్ కిషోర్‌ సలహా మేరకు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దపడతారో లేదో మరో ఆరేడు నెలల్లోనే స్పష్టత రావచ్చు.


Related Post