సిఎం కేసీఆర్‌తో పనిచేయడం కత్తి మీద సామే: గవర్నర్‌

April 19, 2022


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంపై, ఈసారి సిఎం కేసీఆర్‌ పేరు ప్రస్తావించి మరీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పని చేయడం కత్తి మీద సాము వంటిదే. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కొందరు ముఖ్యమంత్రులు నియంతల్లా వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. నేను ఒకేసారి ఇద్దరు తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తున్నాను. వారిలో ఒకరు నేను ఫోన్‌ చేసినా పట్టించుకోరు. మరొకరు నేను ఫోన్‌ చేయగానే ఎంతో మర్యాదగా స్పందిస్తుంటారు. తెలంగాణలో నేను జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు నాకు ఆహ్వానం పలకాలి. కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రారు. ఈవిదంగా ఓ మహిళా గవర్నర్‌ను అవమానించడం వారికి భావ్యం కాదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలుత సిఎం కేసీఆర్‌తోనే నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రయత్నించారు. కానీ సిఎం కేసీఆర్‌ ఆమెను దూరంగా పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. సిఎం కేసీఆర్‌ ఆమెను దూరంగా పెట్టినందున ప్రభుత్వంలో అందరూ కూడా ఆమెకు దూరంగానే మెసులుతున్నారు. అయితే ఈ సమస్య ఇంతటితో ఆగలేదు. ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ మరో అడుగు ముందుకు వేసి ‘ఆమె గవర్నర్‌లాగ కాక ఓ బిజెపి నేతలాగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్‌గా వ్యవహరిస్తుంటే ఆమెకు సముచిత గౌరవం లభించి ఉండేదని ఆరోపించారు. 

కనుక గవర్నర్‌తో టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టమయింది. ఈ పరిస్థితులలో ఆమె కూడా ప్రభుత్వం గురించి మాట్లాడక తప్పడం లేదు. అయితే దీని వలన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏమీ నష్టపోరు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో ప్రోటోకాల్ పాటించకపోతే మున్ముందు అధికారులే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 


Related Post