మతకలహాలు లేవు... విద్యుత్‌ కోతలు లేవు: కేటీఆర్‌

April 19, 2022


img

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాతే హైదరాబాద్‌లో మళ్ళీ ప్రశాంత వాతావరణం ఏర్పడింది. కులమతాలు, గొడవలతో రాజకీయాలు చేయకుండా అభివృద్ధి, శాంతిభద్రతలే అజెండాగా మన ప్రభుత్వం పనిచేస్తోంది. నాకు ఇప్పటికీ గుర్తే. నా చిన్నప్పుడు హైదరాబాద్‌లో స్కూలుకి వెళ్ళేటప్పుడు మతకలహాల కారణంగా తరచూ కర్ఫ్యూలు విధించేవారు. ఆ కారణంగా నెలకి నాలుగైదు రోజులైనా స్కూళ్ళు మూతపడేవి. కానీ గత ఏడున్నరేళ్ళుగా నగరంలో చాలా ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలందరూ కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. మతం పేరుతో అల్లర్లు, విధ్వంసం సృష్టించేవారిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు అయినా పాతబస్తీని రూ.495 కోట్లు ఖర్చు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేసుకొంటున్నాము. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపిస్తున్నాము. పాతబస్తీలో విద్యుత్‌, త్రాగునీరుకి ఇప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేదు. త్వరలోనే  రోడ్లు వెడల్పు చేస్తాము,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ చెప్పింది అక్షరాల నిజమే. మజ్లీస్‌ పార్టీతో టిఆర్ఎస్‌ స్నేహంగా ఉండటానికి ఇదీ ఒక కారణమని చెప్పక తప్పదు. మజ్లీస్‌ పార్టీ కూడా పరిస్థితి అర్దం చేసుకొని టిఆర్ఎస్‌తో కలిసి ముందుకు సాగుతూ నగరంలో శాంతిభద్రతలకు సహకరిస్తోంది. పాతబస్తీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి తోడ్పడుతోంది. కనుక టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీల బంధం ఎప్పటికీ ఇలాగే బలంగా ఉండాలని కోరుకోవలసిందే.


Related Post