తెలంగాణలో రాష్ట్రపతి పాలన: ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

April 19, 2022


img

పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సరికొత్త డిమాండ్ కేంద్రప్రభుత్వం ముందు పెట్టారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను టిఆర్ఎస్‌ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తోందని, పోలీసుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేస్తోందని ఆరోపించారు. కనుక రాష్ట్రంలో ఎప్పుడు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగినా రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదని అన్నారు. సిఎం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎన్నికలలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా పాల్గొనలేని పరిస్థితులు కల్పిస్తారని అన్నారు. సిఎం కేసీఆర్‌ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు.  

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారో లేదో మాకు అనవసరం కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రపతి పాలన విదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

ఇప్పటికే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి రాష్ట్ర ప్రభుత్వానికి మద్య దూరం చాలా పెరిగింది. ప్రోటోకాల్ విషయంలో ఆమె ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేయడంతో కేంద్రప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్రను టిఆర్ఎస్‌ కార్యకర్తలు అడ్డుకోవడం, రాళ్ళదాడులకు పాల్పడటం వంటి ఘటనలను కేంద్రం తీవ్రంగానే పరిగణిస్తుందని వేరే చెప్పక్కరలేదు. 

రాష్ట్రంలో ఇప్పుడే ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే ఎన్నికలప్పుడు ఏవిదంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కేంద్రహోంమంత్రి అమిత్ షా మొదలు రాష్ట్ర బిజెపి నేతల వరకు అందరూ గట్టిగానే చెపుతున్నారు. కనుక టిఆర్ఎస్‌ ప్రభుత్వం పోలీస్ శాఖను ఉపయోగించుకొని బిజెపిని కూడా ఎన్నికలలో దెబ్బతెస్తుందని భావిస్తే కేంద్రప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యం లేదు.


Related Post