బిజెపి కోరుకొన్నదే టిఆర్ఎస్‌ చేస్తోందా?

April 19, 2022


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న మహాసంగ్రామ యాత్రలో పేరుకు తగ్గట్లే టిఆర్ఎస్‌, బిజెపిల మద్య  సంగ్రామాలతో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా సోమవారం ఆయన, పార్టీ కార్యకర్తలతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలంలో పాదయాత్ర చేస్తుండగా వేముల గ్రామశివార్లలో టిఆర్ఎస్‌ కార్యకర్తలు వారిని అడ్డుకొన్నారు. దాంతో ఇరువర్గాల మద్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. బండి సంజయ్‌ వెంట వస్తున్న పోలీసులు వారిని శాంతిప చేయడంతో బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగించారు. 

అయితే మళ్ళీ కొద్ది సేపటికే టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు అక్కడకు ఓ వాహనంలో చేరుకొని వారిని అడ్డుకొన్నారు. ఈసారి వారిని పోలీసులు అడ్డుకోలేకపోవడంతో ఇరువర్గాల మద్య ఘర్షణ మొదలై పరస్పరం రాళ్ళ దాడులు చేసుకొన్నారు. ఈ దాడులలో ఇరుపార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. నాలుగు కార్ల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకొన్న జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్‌ పోలీసు బృందంతో అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టి మరికొంత మంది పోలీసులను కేటాయించడంతో బండి సంజయ్‌ మళ్ళీ పాదయాత్ర కొనసాగించారు.     

బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకొనేందుకు టిఆర్ఎస్‌ కార్యకర్తలు రాళ్ళదాడి చేయడాన్ని ఆయనతో సహా రాష్ట్ర బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజల కష్టానష్టాలు తెలుసుకొనేందుకు పాదయాత్ర చేస్తుంటే టిఆర్ఎస్‌ గూండాల చేత భౌతిక దాడులు చేయించి అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకమంది బలిదానాలతో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో చివరికి ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఇవి స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అయితే ఇటువంటి దాడులకు భయపడి మద్యలో పాదయాత్ర విరమించబోనని, బరాబర్ కొనసాగిస్తానని బండి సంజయ్‌ అన్నారు. 

ఈ పాదయాత్ర ద్వారా బిజెపి ప్రజలకు మరింత చేరువవ్వాలని భావిస్తోంది. కనుకనే టిఆర్ఎస్‌ దీనిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తునట్లు అర్దమవుతోంది. అయితే వైఎస్ షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిత్యం తెలంగాణ ప్రభుత్వంపై, సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ పాదయాత్ర చేస్తున్నప్పటికీ వారిని పట్టించుకోని టిఆర్ఎస్‌, బండి సంజయ్‌ పాదయాత్రను మాత్రం ఎందుకు అడ్డుకొంటున్నారు? అంటే వారి వలన తెరాసకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని కానీ ఈ పాదయాత్రతో రాష్ట్రంలో బిజెపి మరింత బలపడుతుందని, బండి సంజయ్‌ మరింత పాపులర్ అవుతారనే భయంతోనే కావచ్చు. కానీ ఇటువంటి ఘటనలతో బండి సంజయ్‌పై ప్రజలలో సానుభూతి, టిఆర్ఎస్‌ పట్ల విముఖత ఏర్పడవచ్చునని గ్రహించినట్లు లేదు. 

బండి సంజయ్‌ పాదయాత్రకు టిఆర్ఎస్‌ ఎంతగా ఆటంకాలు కలిగిస్తే అంతగా దానికి ఉచిత ప్రచారం లభిస్తుంది. నిజానికి బిజెపి కూడా ఇలాగే జరగాలని  కోరుకొంటోందని చెప్పవచ్చు. తాము కోరుకొన్నట్లే టిఆర్ఎస్‌ వ్యవహరిస్తోంది కనుక బిజెపి దీనిని పైకి ఖండిస్తున్నప్పటికీ లోలోన స్వాగతిస్తుండవచ్చు. 


Related Post