భారత్‌కు మళ్ళీ కరోనా బెడద తప్పదా?

April 18, 2022


img

భారత్‌కు మళ్ళీ కరోనా బెడద తప్పదా? అంటే అవుననే అనిపిస్తోంది. మళ్ళీ ఈసారి కూడా ఎప్పటిలాగే ముందుగా ఢిల్లీ, కేరళలో కరోనా కేసులు మొదలయ్యి రోజుల వ్యవధిలోనే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం ముంబైలో కొత్త వేరియెంట్ బయటపడింది. మహరాష్ట్రలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. 

ఢిల్లీలో గత వారం వరకు రోజుకి 500 నుంచి 1,000 లోపుగా కొత్త కేసులు నమోదవుతుండేవి. కానీ ఆదివారం ఒక్కరోజే వాటి సంఖ్య 2,183కి పెరిగింది. కేరళలో నిన్న కొత్తగా 940 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి నిన్న ఒక్కరోజే దేశంలో 11,542 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీటి  కంటే కరోనా మరణాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 214 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

దేశంలో కరోనా పూర్తిగా తగ్గిపోయినందున కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తివేయడం, ఆ కారణంగా కరోనా ప్రభావిత దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు పెరగడం, దేశ ప్రజలలో మళ్ళీ అలసత్వం పెరిగి కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం, నేటికీ కొంతమంది ఒక్క డోస్‌కు టీకా కూడా వేసుకోకపోవడం వంటివి కరోనా పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 

కనుక ఇదేవేగంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లయితే, బహుశః మే నెలాఖరులోగా మళ్ళీ భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరగవచ్చు. అప్పుడు మళ్ళీ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు తప్పకపోవచ్చు. కనుక దేశ ప్రజలందరూ విధిగా టీకాలు వేయించుకొని, మాస్కులు ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం వంటి అన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.


Related Post