కేసీఆర్‌ జిగిరీ దోస్త్...ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌తో దోస్తీ!

April 16, 2022


img

సిఎం కేసీఆర్‌ కొన్ని వారాల క్రితమే ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ తన జిగిరీ దోస్త్ అని, అతను పైసా ఆశించకుండా తమతో కలిసి పనిచేస్తున్నాడని ప్రెస్‌మీట్‌లో కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన సిఎం కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమయ్యారు! 

ఈరోజు ఆయన ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలతో సుదీర్గంగా సమావేశమయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా ముందుకు వెళ్ళాలో ఆయన తమకు వివరించారని కేసి వేణుగోపాల్ చెప్పారు. కనీసం 370-400 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తేనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించగలరని, కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో వ్యూహాత్మక పొత్తులు లేదా కూటములు ఏర్పాటు చేసుకోవాలని ప్రశాంత్ కిషోర్‌ సూచించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా కంటే పార్టీలో చేరి గెలిపించుకొంటే బాగుంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్‌ సూచించినందున, తెలంగాణలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను జత కట్టిస్తారా? అనే సందేహం కలుగుతుంది. అయితే ఇంతకాలం కాంగ్రెస్‌, బిజెపిల పాలన వలననే దేశం భ్రష్టు పట్టిపోయిందని రెంటినీ బంగాళాఖాతంలో విసిరేయాలని నిప్పులు చెరిగి, వాటికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేస్తానని శపధం చేసిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు ఒప్పుకొంటారా? ఒప్పుకొంటే ప్రజలకు, బిజెపికి ఏమి జవాబు చెపుతారు?సిఎం కేసీఆర్‌ని జైలుకి పంపిస్తానని శపదం చేస్తున్న రేవంత్‌ రెడ్డి అప్పుడు ఏమి చేస్తారు?

ఒకవేళ కాంగ్రెస్‌తో దోస్తీకి సిఎం కేసీఆర్‌ ఒప్పుకోకపోతే, కాంగ్రెస్ పార్టీని గెలిపించే కాంట్రాక్టు తీసుకొంటున్న ప్రశాంత్ కిషోర్‌ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తారా?వంటి అనేక సందేహాలకు రాబోయే రోజుల్లో సమాధానాలు దొరకుతాయి. కనుక అంతవరకు వేచి చూడాల్సిందే. 


Related Post