తెలంగాణకు కొత్త సమస్య

April 16, 2022


img

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు సిద్దపడటంతో కొత్త సమస్య వచ్చి పడింది. క్వింటాకు రూ.1,960 గిట్టుబాటు ధర ప్రకటించడంతో ఊహించినట్లే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు లారీలలో ధాన్యం వేసుకొని తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తున్నారు. ప్రభుత్వం ఇది ముందే ఊహించింది కనుక రాష్ట్ర సరిహద్దులలో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో ప్రతీరోజు ధాన్యం లోడుతో వస్తున్న వందల కొద్దీ లారీలు చెక్ పోస్ట్ వద్ద బారులు తీరుతున్నాయి. చెక్ పోస్ట్ సిబ్బంది వారికి నయాన్న భయాన్నో నచ్చజెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఇదేదో ఒక రోజు...రెండు రోజుల తంతు అనుకొంటే పర్వాలేదు కానీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసేవరకు అంటే మరో నెల రెండు నెలల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం లారీలను గుర్తించి వెనక్కి తిప్పి పంపించడం చాలా కష్టమే. 

ముఖ్యంగా ధాన్యం ఎక్కువగా పండించే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నిత్యం వందల కొద్దీ లారీలు ధాన్యం లోడుతో వస్తున్నాయి. మొదట వారికి చాలా మెత్తగా చెప్పిన చెక్ పోస్ట్ సిబ్బంది ఇప్పుడు కటినంగా వ్యవహరించక తప్పడం లేదు. తక్షణం వెనక్కు తిరిగి వెళ్ళకపోతే లారీలను, ధాన్యాన్ని సీజ్ చేసి, లారీ యజమాని, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించవలసి వస్తోంది. అయితే వారి హెచ్చరికలకు భయపడి కొన్ని లారీలు వెనక్కు మళ్ళగానే వాటి వెనుక మళ్ళీ వందల కొద్దీ లారీలు వస్తుండటంతో చెక్ పోస్ట్ సిబ్బంది నానా తిప్పలు పడుతున్నారు. 

అలాగని ధాన్యం లారీలను రాష్ట్రంలోకి విడిచిపెడితే ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక మండుటెండల్లో నిలబడి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం లారీలను అడ్డుకొంటున్నారు. మరో ఒకటి రెండు నెలల వరకు వారికి ఈ తిప్పలు తప్పవేమో? 


Related Post