ప్రాణాలు బలిగొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు

April 16, 2022


img

తెలంగాణ రాష్ట్రం..ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పలువురు ఈ రంగంలో ప్రవేశించి కోట్లు ఆర్జిస్తున్నారు. కానీ కొందరు ఈ వ్యాపార లావాదేవీలలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 

తాజాగా మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగం సంతోష్ (40), అతని తల్లి గంగం పద్మ (65) కామారెడ్డి జిల్లా కేంద్రంలో న్యూ మహారాజా లాడ్జిలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొనే ముందు సంతోష్ సెల్ఫీ వీడియోలో తాను నమ్మిన వ్యాపార భాగస్వామే మోసం చేయడంతో తట్టుకోలేక, వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొంటున్నామని చెప్పాడు.    

“నేను, బాసం శ్రీనుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. ఓసారి శ్రీనుకి డబ్బు అవసరమైతే జితేందర్ గౌడ్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.50 లక్షలు ఇప్పించాను. అప్పటి నుంచి అతను నా వ్యాపారంలో వాటా ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. కానీ నేను ఒప్పుకోకపోవడంతో జితేందర్ గౌడ్, అనుచరులతో నన్ను వేధించసాగారు. అతనికి ఓ స్థానిక ప్రజా ప్రతినిధి, ఇదివరకు కామారెడ్డిలో సీఐగా చేసిన నాగార్జున సహకరించేవారు. వారు నన్ను వేధిస్తున్న విషయం మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. కానీ జితేందర్ గౌడ్ వేదింపులు ఆగలేదు. అతను నన్ను నా వ్యాపారం చేసుకోనీయలేదు. అడుగడుగునా అడ్డుపడుతుండటంతో నేను చాలా నష్టపోయాను. నమ్మిన స్నేహితుడే నన్ను దగా చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ నష్టాలు, వాళ్ళ వేదింపులు భరించలేక మేము ఆత్మహత్య చేసుకొంటున్నాము,” అని చెప్పారు. 

కామారెడ్డి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...సంతోష్ తన తల్లి పద్మకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఈ నెల 11న కామారెడ్డికి తల్లిని వెంటబెట్టుకొని కామారెడ్డికి వచ్చాడు. జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజా లాడ్జిలో వారు దిగారు. మర్నాడు సంతోష్ తల్లికి వైద్య పరీక్షలు చేయించాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి శ్రీ కాలభైరవస్వామి ఆలయానికి వెళ్ళి పూజలు చేశారు. అప్పటి నుంచి లాడ్జిలోనే ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వారుంటున్న గదిలో నుంచి పొగలు వస్తుండటంతో లాడ్జి సిబ్బంది వెంటనే మాకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సోమనాధం, సీఐ నరేశ్ వెంటనే వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా గదిలో సజీవదహనమైన తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. 



Related Post