హైకోర్టుకు వస్తే అమ్మ ఒడిలో ఉన్నట్లనిపిస్తుంది: జస్టిస్ ఎన్‌వి రమణ

April 16, 2022


img

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ శుక్రవారం హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, సిఎం కేసీఆర్‌, ఇక్కడి ప్రజలు పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్నారు. గచ్చిబౌలిలో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి సిఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని ప్రస్తావించి ‘ఆయన చేతికి ఎముక లేదంటూ...’ మెచ్చుకొన్నారు. జిల్లా స్థాయి కోర్టులలో జడ్జీల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఆ తరువాత తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు తనను సన్మానించినప్పుడు, జస్టిస్ ఎన్‌వి రమణ తెలంగాణ పట్ల తన అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను తెలంగాణ హైకోర్టులో 11 ఏళ్ళు పనిచేసి చాలా నేర్చుకున్నాను. అందుకే ఇక్కడ హైకోర్టులో అడుగుపెడితే తల్లి ఒడిలో సేదతీరుతున్నట్లు అనిపిస్తుంది నాకు. నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయిన్నప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినే. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ శతకోటి వందనాలు. తెలంగాణ సాధన కోసం హైకోర్టు న్యాయవాదులు చేసిన పోరాటాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి,” అని అన్నారు. 

సాధారణంగా ఈ స్థాయిలో ఉన్న ప్రముఖులు ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరిస్తుంటారు ఆచితూచి మాట్లాడి వెళ్లిపోతుంటారు తప్ప ఈవిదంగా మనసువిప్పి మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఆయన ఈ స్థాయిలో ఉన్నా “నేను ఎప్పటికీ తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినే...” అంటూ తెలంగాణ రాష్ట్రం పట్ల తన అభిమానాన్ని జస్టిస్ ఎన్‌వి రమణ చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంతటి ప్రేమాభిమానాలు చూపే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవడం తెలంగాణ అదృష్టం అనుకోవాలి.


Related Post