టిఆర్ఎస్‌ జోరును బిజెపి అడ్డుకోగలదా?

April 15, 2022


img

టిఆర్ఎస్‌ ప్రభుత్వం అప్పుడప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపించినా సిఎం కేసీఆర్‌ అనూహ్యమైన నిర్ణయాలు, రాజకీయ ఎత్తుగడలతో ప్రతిపక్షాలపై పైచెయ్యి సాధిస్తుంటుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తీవ్ర అప్రదిష్టపాలైనప్పుడు కాంగ్రెస్‌, బిజెపిలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి వారి మనసులు గెలుచుకున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఆర్టీసీ కార్మికులను అక్కున చేర్చుకొని తనను ఎదిరించి పోరాడిన కార్మికులతోనే పాలాభిషేకాలు చేయించుకోగా, వారికి అండగా నిలబడిన కాంగ్రెస్‌, బిజెపిలను పట్టించుకొనే నాధుడే లేకుండా పోయాడు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో సిఎం కేసీఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చి బిజెపిని ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఢిల్లీలో ధర్నా చేస్తే, రాష్ట్ర బిజెపి నేతలు కేసీఆర్‌ని దోషిగా నిలబెట్టేందుకు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేశారు. ఒకవేళ టిఆర్ఎస్‌ ఈ పోరాటం ఇంకా కొనసాగించి ఉండి ఉంటే, వరి రైతుల ఆగ్రహానికి గురయ్యేది. ఈ విషయం సిఎం కేసీఆర్‌ ముందే ఊహించారు కనుక హటాత్తుగా ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు పోరాడేందుకు అవకాశం లేకుండా చేశారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు ముందు దళిత బంధు నిధులు హడావుడిగా పంచిపెట్టిన టిఆర్ఎస్‌ సర్కార్, ఇప్పుడు నిధులు కేటాయించినా వాటిని హడావుడిగా పప్పు బెల్లాలగ పంచిపెట్టేయడం లేడు. ఆ ప్రక్రియను మెల్లగా నడిపిస్తోంది. అలాగే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగంగా ముగించకుండా వచ్చే ఎన్నికల వరకు కొనసాగేలా చేయబోతున్నట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయిస్తోంది. ఇవన్నీ చూస్తే సిఎం కేసీఆర్‌ చాలా దూరం ఆలోచించి పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతున్నారని స్పష్టం అవుతోంది. 

ఇక టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ దాంతో రాష్ట్ర బిజెపిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలతో ఏవిదంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలకు అవసరం లేదు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారా లేదా? సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారా లేదా?ఉద్యోగాలు కల్పిస్తున్నారా లేదా? అని మాత్రమే చూస్తారు. ఈ మూడు అంశాలలో సిఎం కేసీఆర్‌ ప్రజలను సంతృప్తి పరిచారనే చెప్పవచ్చు. 

కనుక బండి సంజయ్‌ పాదయాత్రలతో ప్రజల నమ్మకం పొందగలరా? కేవలం మతరాజకీయాలతో ఎన్నికలలో టిఆర్ఎస్‌పై పైచెయ్యి సాధించగలరా? అంటే కాదనే చెప్పవచ్చు. కనుక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బిజెపియే అది ఏవిదంగా సాధ్యపరుచుకోవాలని ఆలోచించుకోవలసి ఉంటుంది. 


Related Post