చావుకి, పెళ్ళికి ఒకటే డప్పు కొడతారా? కేటీఆర్‌

April 15, 2022


img

ఎస్సీ సంక్షేమశాఖ అధ్వర్యంలో గురువారం సిరిసిల్లలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ రాజ్యాంగం, దళిత బంధు పధకం, విగ్రహాల ఏర్పాటు, ప్రభుత్వంపై కులసంఘాల విమర్శలు తదితర అంశాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, “అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలననే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజ్యాంగం పట్ల మాకు చాలా గౌరవం ఉంది. అయితే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదెవరో అందరికీ తెలుసు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల హక్కులు కాపాడాల్సిన కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించివేస్తోంది. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాల్సిన ప్రభుత్వం వివక్ష చూపుతోంది,” అని అన్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే సిఎం కేసీఆర్‌ రాజ్యాంగం మార్చాలని, కొత్త రాజ్యాంగం రాసుకోవాలని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 

దళిత బంధు పధకం గురించి మాట్లాడుతూ, “ఇంతవరకు దేశంలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధు వంటి పధకం ప్రవేశపెట్టలేదు. సిఎం కేసీఆర్‌ మాత్రమే దళితుల సంక్షేమం గురించి ఆలోచించి ఈ పధకం ప్రవేశపెట్టారు. బడుగు బలహీనవర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి పరితపించే ఏకైక వ్యక్తి సిఎం కేసీఆర్‌,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వివిద వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పధకాలతో రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సమంజసమే అని సిఎం కేసీఆర్‌ స్వయంగా శాసనసభలో అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు ముందు హడావిడిగా ప్రకటించిన దళిత బంధు కూడా అటువంటిదే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

"దేశంలో సొంత విగ్రహాలు ఏర్పాటుచేసుకొన్న ముఖ్యమంత్రులున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం 125 అడుగుల ఎత్తైన    అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారు,” అని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్‌ తరాలవారికి తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు అంటూ యాదాద్రి ఆలయంలో సిఎం కేసీఆర్‌ బొమ్మను చెక్కించడంపై దుమారం చెలరేగడం, దాంతో హడావుడిగా దానిని తొలగించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే నిత్యం ఏదో ఒకందుకు సిఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసే కొత్త సంస్కృతి తెలంగాణలో బలపడింది. ఓ వైపు ఈవిదంగా వ్యక్తిపూజలను, భజనలను ప్రోత్సహిస్తూ ఇతరులను విమర్శించడం సరికాదనే చెప్పాలి. 

కులసంఘాల విమర్శల గురించి మాట్లాడుతూ, “కులసంఘాల నేతలు సమావేశాలు ఏర్పాటుచేసుకొని నన్ను పిలిచి నా ఎదుటే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. అందుకే నేను అటువంటి సమావేశాలకు హాజరుకాను. వేదికలపై గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టమైన పని. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పధకాలను పట్టించుకోకుండా చావుకి, పెళ్ళికి ఒకటే డప్పు కొట్టినట్లుగా ఇంకా ఏదో చేయలేదంటూ, ఎవరికో అన్యాయం జరిగిపోతోందంటూ ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించడమేనా? మంచిని మంచిగా చెప్పాలి. చెడును చెడు అనాలి. ప్రజలలో ఈ కుల పిచ్చి, మత పిచ్చి తగ్గాలి. ఈ ప్రపంచంలో ధనిక, పేద అనే రెండు కులాలు ఉన్నట్లు నేను భావిస్తాను,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 


Related Post