ధాన్యం కొనుగోలుపై కొందరు హర్షం..కొందరు విచారం

April 14, 2022


img

ఈ యాసంగి సీజనులో తెలంగాణలో పండిన దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వమే క్వింటా రూ.1960 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించి, అందుకు చుకురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై అనేకమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా అనేకమంది విచారం వ్యక్తం చేస్తున్నారు కూడా. రాష్ట్ర ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధర ప్రకటించి, డబ్బు చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుంటే రైతులు సంతోషిస్తారు కానీ ఎందుకు విచారిస్తారు?అంటే దానికీ బలమైన కారణాలున్నాయి.

కేంద్రప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రంలో ధాన్యం సాగుచేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, ఒకవేళ ఎవరైనా ధాన్యం పండిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని సీజను మొదలవకముందే సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను గట్టిగా హెచ్చరించారు. దాంతో చాలా మంది రైతులు తమ భూములలో 25-50 శాతం బీడు పెట్టేసి మిగిలిన భూమిలో ఇతర పంటలు, కూరగాయలు వగైరా పండించుకొన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడమే కాకుండా మంచి గిట్టుబాటు ధర కూడా ప్రకటించడంతో ఆ రైతులందరూ బాధపడుతున్నారు. ఈ మాట ప్రభుత్వం అప్పుడే చెప్పి ఉండి ఉంటే తాము కూడా ధాన్యం పండించుకొని ఎంతో కొంత ఆదాయం సంపాదించుకొనేవారిమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట వినకుండా ధాన్యం పండించిన రైతులు ఇప్పుడు లాభపడుతుండగా, ప్రభుత్వం చెప్పిన మాట విని తాము నష్టపోయామని బాధ పడుతున్నారు. 

అయితే ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ వినకుండా ధాన్యం పండించిన చాలా మంది రైతులు కూడా నష్టపోయారు. ఈసారి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయబోమని ముందే చెప్పాయి కనుక ఆలస్యం చేస్తే నష్టపోవలసి వస్తుందనే భయంతో చాలా మంది రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని క్వింటా రూ.1350-1400 చొప్పున అమ్మేసుకొన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం క్వింటాకు రూ.1960 ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తోంది. కనుక వారు కూడా భారీగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేస్తుందని ముందే ప్రకటించి ఉండి ఉంటే, తాము ఈవిదంగా నష్టపోయి ఉండేవారిమి కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వలన తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Related Post