అక్బరుద్దీన్‌కి రెండు కేసుల నుంచి విముక్తి

April 13, 2022


img

మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదైన రెండు కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఈ రెండు కేసులలో ఆయన దోషి అని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఆయనను నిర్ధోషిగా పరిగణించి రెండు కేసులు కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే, మత విద్వేషాలను రెచ్చగొట్టే అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయవద్దని, వాటి వలన దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని సున్నితంగా మందలించి రెండు కేసుల నుంచి విముక్తి కల్పించింది. కేసులు కొట్టేసి విముక్తి కల్పించినంత మాత్రన్న సంబురాలు చేసుకోవద్దని కోర్టు హెచ్చరించింది.      

కోర్టు తీర్పుపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “ప్రభుత్వం అక్బరుద్దీన్ ఓవైసీని కాపాడేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసును నీరుగార్చింది. టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లీస్‌ మూడింటి మద్య అవగాహనకు ఈ కేసు నీరుగార్చడమే ఓ నిదర్శనం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయాలి,” అని అన్నారు. 

అక్బరుద్దీన్ ఓవైసీని ఈ కేసుల నుంచి విముక్తి కల్పిస్తున్నప్పుడు ‘మళ్ళీ ఇటువంటి తప్పు చేయవద్దని’ న్యాయస్థానమే సున్నితంగా హెచ్చరించడం గమనిస్తే, ఆయన దోషి అని న్యాయస్థానం కూడా నమ్ముతోందని స్పష్టమైంది. కానీ బలమైన సాక్ష్యాధారాలు లేనందున విముక్తి కల్పించవలసి వచ్చిందంటే, బండి సంజయ్‌ ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉందని భావించాల్సి ఉంటుంది. 

ఇప్పుడు కోర్టు సున్నితంగా హెచ్చరించి విడిచిపెట్టినప్పటికీ, మళ్ళీ ఎన్నికలొచ్చినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి మళ్ళీ అలాగే మాట్లాడుతారని అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఈ కేసుల నుంచి బయటపడ్డారు కనుక ఇక భవిష్యత్‌లో జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం.


Related Post